- ఖానామెట్టు సర్వే నం.41/13లో రెండు ఎకరాలకు పైగా భూమి చుట్టూ ఐరన్ షీట్లు!
- ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ తహసీల్దార్‌కు సీపీఐ నేతల వినతి
- ఆక్రమణలు తొలగించకపోతే కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరిక
సామాన్యుడి అస్త్రం / శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మండల పరిధిలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందంటూ సీపీఐ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కానమెట్టు పరిధిలోని సర్వే నంబర్ 41/13లో రెండు ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి చుట్టూ ఐరన్ షీట్లు ఏర్పాటు చేసి కబ్జాకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ శేరిలింగంపల్లి మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. సుమారు రూ.300 కోట్ల విలువైన భూమిగా వారు పేర్కొంటున్న ఈ స్థలాన్ని రెవెన్యూ అధికారులు తక్షణమే పరిశీలించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు టి.రామకృష్ణ, శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి కె.చందు యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు తహసీల్దార్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. ప్రభుత్వానికి చెందిన విలువైన భూములను రక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగంపై ఉందని, స్థలం చుట్టూ ఏర్పాటు చేసిన షీట్లను వెంటనే తొలగించాలని కోరారు. భూమి రికార్డులు, సరిహద్దులను పరిశీలించి ఆక్రమణ జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలి
ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనివ్వకుండా కాపాడాలని సీపీఐ నేతలు కోరారు. సర్వే నంబర్ 41/13లోని భూమి ప్రభుత్వానిదని రికార్డుల్లో నిర్ధారణైతే, దానిని ప్రభుత్వ అవసరాలకు లేదా పేదలకు గృహ నిర్మాణం వంటి ప్రజాప్రయోజన కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు. కోట్ల రూపాయల విలువైన భూముల విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి హద్దులను నిర్ధారించాలని డిమాండ్ చేశారు.

స్పందించకపోతే కలెక్టరేట్ ముట్టడి
ఫిర్యాదుపై అధికారులు తక్షణ చర్యలు చేపట్టకపోతే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున కమ్యూనిస్టు కార్యకర్తలతో ఆందోళన చేపడతామని సీపీఐ నేతలు హెచ్చరించారు. వినతిపత్రాన్ని స్వీకరించిన తహసీల్దార్ సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు టి.రామకృష్ణ, శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి కె.చందు యాదవ్‌తో పాటు కె.సుధాకర్, రామస్వామి, ఎస్.కొండలయ్య, ఎస్.వాసు తదితరులు పాల్గొన్నారు.






