‘బరిలో ఉన్నది నేను కాదు.. పవన్ కల్యాణ్ అనుకొని పనిచేయండి’
- సూర్యాపేట వేదికగా జనసేన శ్రేణులకు గడల శ్రీనివాసరావు దిశానిర్దేశం
- ఓటరు నమోదు నుంచి ప్రాధాన్యత ఓటు వరకు కార్యకర్తలకు అవగాహన
- ‘నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను’.. ఉద్యమాల గడ్డపై శ్రీనివాసరావు ప్రతిజ్ఞ
ప్రజాచౌరస్తా / సూర్యాపేట : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోరుకు జనసేన శ్రేణులను సమాయత్తం చేసే దిశగా సూర్యాపేట వేదికగా సన్నాహక సమావేశం జరిగింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, తుంగతుర్తి నియోజకవర్గాలకు నియమితులైన కోఆర్డినేటర్లు పి. జైరాం, యాడమ రాజేష్, శిరీషతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి రామకృష్ణ, బండి నరేష్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన జనసేన నాయకులు, పట్టభద్రులు, జనసైనికులు, వీర మహిళలు సమావేశంలో పాల్గొన్నారు.

‘అభ్యర్థిగా నన్ను కాదు.. పవన్‌ను చూడండి’
ఈ సందర్భంగా గడల శ్రీనివాసరావు పార్టీ శ్రేణులకు కీలక సందేశమిచ్చారు. “ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడింది నేను కాదని.. మన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీలో ఉన్నారనే భావనతో ప్రతి ఒక్కరూ కష్టపడాలి” అని పిలుపునిచ్చారు. ఎన్నికను వ్యక్తిగత పోటీగా కాకుండా పార్టీ బాధ్యతగా తీసుకొని ప్రతి పట్టభద్రుడిని చేరుకునేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే ఏమిటి? ఎమ్మెల్సీ బాధ్యతలు ఏమిటి? పట్టభద్రుల సమస్యలను చట్టసభలో ఏ విధంగా ప్రస్తావించవచ్చు? గతంలో ఎమ్మెల్సీలుగా పనిచేసిన వారు ఏ విధంగా వ్యవహరించారు? అనే అంశాలను వివరిస్తూ కార్యకర్తలకు అవగాహన కల్పించారు.
ఓటు ఎలా?.. శ్రేణులకు పాఠం
పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఓటరు నమోదు నుంచి పోలింగ్ వరకు అనుసరించాల్సిన విధానంపై కార్యకర్తలకు వివరించారు. సాధారణ ఎన్నికలకు భిన్నంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత ఓటు విధానం ఉంటుందని, ఓటర్లకు దీనిపై ముందుగానే స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు.
కేవలం ఎన్నికల సమయంలోనే పట్టభద్రుల వద్దకు వెళ్లడం కాకుండా నిరంతరం వారితో సంబంధాలు కొనసాగించాలని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి, విద్య, నిరుద్యోగం సహా పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటిని సరైన వేదికలపై ప్రస్తావించేలా పనిచేయాలని సూచించారు.
గ్రామం నుంచి పట్టణం వరకు చేరాలి
ప్రతి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలని శ్రీనివాసరావు సూచించారు. అర్హులైన పట్టభద్రులను గుర్తించడం, ఓటరు నమోదు ప్రక్రియపై వారికి సమాచారం అందించడం, పోలింగ్ విధానంపై అవగాహన కల్పించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.
సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, తుంగతుర్తి ప్రాంతాల్లో కోఆర్డినేటర్లు స్థానిక నాయకులు, జనసైనికులు, వీర మహిళలను కలుపుకొని క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.

‘పవన్ నమ్మకాన్ని నిలబెడతా’
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా తనకు బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని గడల శ్రీనివాసరావు పేర్కొన్నారు.
“పవన్ కల్యాణ్ గారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. పార్టీ అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని ఉద్యమాల గడ్డ సూర్యాపేట సాక్షిగా చెబుతున్నా” అని ఆయన ప్రకటించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా సమష్టిగా పనిచేయాలని, అభ్యర్థి గెలుపు కోసం కాకుండా పార్టీ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతగా ఎన్నికలను చూడాలని పిలుపునిచ్చారు.
సూర్యాపేట సమావేశంతో ఎన్నికల సన్నాహాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లే కార్యాచరణకు జనసేన శ్రీకారం చుట్టింది. నియోజకవర్గాల వారీగా పట్టభద్రులను చేరుకునేందుకు కోఆర్డినేటర్లు, నాయకులు, జనసైనికులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.







