AB de Villiers: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని మొదటిసారి చూసినప్పుడు తాను కూడా అతనొక ‘అహంకారి, గర్విష్ఠి’ అనుకున్నానని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాజీ సహచరుడు ఏబీ డివిలియర్స్ తాజాగా ఓపెన్ అయ్యాడు. ప్రఖర్ గుప్తా పాడ్కాస్ట్లో మాట్లాడిన డివిలియర్స్.. కోహ్లీతో తన తొలి పరిచయం, ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏర్పడిన బలమైన స్నేహం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. కోహ్లీ, డివిలియర్స్ ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ఆడుతున్న సమయంలో మంచి స్నేహితులుగా మారారు. ఇద్దరి మధ్య ప్రస్తుతం ఎంతో బలమైన బంధం ఉన్నప్పటికీ.. ప్రారంభంలో మాత్రం పరిస్థితి అలా లేదని డివిలియర్స్ తెలిపాడు. కోహ్లీని చూసి మొదట్లో తాను కూడా ‘అహంకారి, ఓవర్కాన్ఫిడెన్స్ ఉన్నవాడు’ అనుకున్నావా? అని అడిగినప్పుడు.. డివిలియర్స్ అవుననే సమాధానం చెప్పాడు.
అయితే, తాము ఆ రోజుల్లో దాన్ని అహంకారంగా భావించినప్పటికీ, అది నిజానికి కోహ్లీలో ఉండే అసాధారణమైన ఆత్మవిశ్వాసమని డివిలియర్స్ వివరించాడు. చిన్న వయస్సు నుంచే కోహ్లీలో ఆ సెల్ఫ్-బిలీఫ్ స్పష్టంగా కనిపించేదని, కానీ దాన్ని చాలామంది సరిగ్గా అర్థం చేసుకోలేక అహంకారంగా పొరబడ్డారని పేర్కొన్నాడు. “అది అహంకారం కాదు.. కేవలం అత్యున్నత స్థాయి ఆత్మవిశ్వాసమే. కోహ్లీ ఎప్పుడూ తన స్టైల్లోనే క్రికెట్ ఆడాడు. కానీ కొన్నిసార్లు కోహ్లీ ప్రవర్తన ఇతరులకు తప్పుగా అర్థం అయ్యింది. నా విషయంలోనూ అదే జరిగింది. మొదటి సారి చూసినప్పుడు నాకు కూడా అలాగే కనిపించాడు. కొంచెం అతిగా ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిలా అనిపించింది.” అని డివిలియర్స్ చెప్పుకొచ్చారు.
కోహ్లీ అంటే సుమారు 19, 20, 21 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడే ఎంతో ఆత్మవిశ్వాసంతో కూడిన కుర్రాడిగా ఉండేవాడని డివిలియర్స్ గుర్తుచేసుకున్నాడు. ఆ సమయంలో కోహ్లీ ప్రవర్తనను తాను సరదాగానే చెబుతుంటానని, అయితే కాలం గడుస్తున్న కొద్దీ కోహ్లీలో చాలా మార్పు వచ్చిందని చెప్పాడు. వయస్సు పెరిగే కొద్దీ, వ్యక్తిగా, క్రికెటర్గా మరింత పరిణతి చెందేసరికి ఆ అతి ఆత్మవిశ్వాసపు ఛాయలు తగ్గిపోయాయని తెలిపాడు. యువ వయసులో తాను నిరూపించుకోవాల్సిన విషయాలు చాలా ఉండటం వల్లే కోహ్లీ అలా ఉండేవాడని, కాలక్రమేణా ఆ ఒత్తిడి, ఆ నిరూపించుకోవాలనే తపన కూడా తగ్గిపోయిందని డివిలియర్స్ అన్నారు. ఆ తర్వాత వ్యక్తిగతంగా కోహ్లీలో బ్యాలెన్స్ వచ్చిందని, ఇతరులతో వ్యవహరించేటప్పుడు తాను ఓవర్కాన్ఫిడెంట్గా ఉండాలనే ఫీలింగ్ క్రమక్రమంగా మారిపోయిందని డివిలియర్స్ స్పష్టం చేశాడు. అలా ఆరంభంలో అహంకారిగా అనిపించిన కోహ్లీనే కాలక్రమేణా తనకు బెస్ట్ ఫ్రెండ్గా మారాడని డివిలియర్స్ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.






