AP Police Recruitment: పోలీస్ శాఖలో కొలువు సాధించాలనుకునే హోంగార్డులకు ప్రభుత్వం బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసే పోలీస్ స్టయిఫండరీ కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాల్లో హోంగార్డులకు 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్ వర్తింపజేస్తూ హోంశాఖ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు డ్రైవర్ కానిస్టేబుల్ పోస్టులకు(AP Police Recruitment) సంబంధించి హోంగార్డులకు ఉన్న రిజర్వేషన్ నిబంధనలను సవరిస్తూ ఈ కీలక నోటిఫికేషన్ విడుదల చేశారు. సుదీర్ఘకాలంగా విధుల్లో సేవలు అందిస్తున్న హోంగార్డుల శ్రమను గుర్తించి, వారికి ఉద్యోగోన్నతి, స్థిరమైన భవిష్యత్తును కల్పించే దిశగా ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
నియామకాల్లో హోంగార్డులకు ప్రాధాన్యం – మారని ఇతర కేటగిరీల రిజర్వేషన్లు:
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రస్తుతం జరగబోయే పోలీస్ డ్రైవర్ రిక్రూట్‌మెంట్‌లో హోంగార్డులకు విశేష ప్రయోజనం చేకూరనుంది. స్టయిఫండరీ ట్రైనీ డ్రైవర్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల్లో హోంగార్డులు సులువుగా అవకాశాలను దక్కించుకునేందుకు ఈ 10 శాతం రిజర్వేషన్ ఎంతగానో ఉపయోగపడనుంది. కాగా, ఇతర ప్రత్యేక కేటగిరీలకు వర్తించే రిజర్వేషన్లు ఎటువంటి మార్పులు లేకుండా యథావిధిగా కొనసాగుతాయని హోంశాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ కొత్త సవరణతో పోలీస్ శాఖలో చేరాలనుకునే అర్హులైన హోంగార్డుల్లో తీవ్ర ఆనందం వ్యక్తమవుతోంది.






