మంగళగిరి: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజలను బెదిరిస్తూ, ఇబ్బందులకు గురిచేసే రౌడీలపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు. రప్పారప్పా అంటూ ప్రజలను ఇబ్బంది పెట్టే రౌడీల తాట తీయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారిని సహించకూడదని, నేరస్తులకు రాజకీయాలు రక్షణ కల్పించకూడదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఇతరులను వేధించే వారిపైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.
మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌లో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల స్మారక పుస్తకాలను సీఎం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. శాంతిభద్రతలు, అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పరస్పరం ముడిపడి ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో అలజడి, అశాంతి ఉంటే పెట్టుబడిదారులు ముందుకు రారని పేర్కొన్నారు. నేరం జరిగిన తర్వాత ఛేదించడం పోలీసుల సమర్థతకు నిదర్శనమైతే, నేరం జరగకుండా నివారించడమే అత్యుత్తమ పోలీసింగ్‌కు గుర్తు అని చెప్పారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
పోలీసుల విధులు అత్యంత ఒత్తిడితో కూడుకున్నవని సీఎం పేర్కొన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వాన్ని కాపాడుకోవాలని, యోగా, ధ్యానం అలవాటు చేసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు బాధతో, భయంతో వచ్చే ప్రజల సమస్యలను మానవత్వంతో పరిష్కరించాలని చెప్పారు. పోలీసు యూనిఫాం బాధితులకు భరోసానివ్వాలని, నేరస్థుల్లో భయం కలిగిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని అన్నారు.
అర్ధరాత్రి మహిళ ఒంటరిగా నిర్భయంగా తిరగగలిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం సాధించినట్లనే గాంధీజీ మాటలను గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవించేలా, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించేలా పోలీసులు పనిచేయాలని కోరారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, పోలీసుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. అమరవీరులకు అందించే నిజమైన నివాళి రాష్ట్రంలో మెరుగైన శాంతిభద్రతలను నెలకొల్పడమేనని పేర్కొన్నారు..
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..






