మూవీ రివ్యూ: క్రేజీ కళ్యాణం
నటీనటులు: అనుపమ పరమేశ్వరన్, అఖిల్ రాజ్, తరుణ్ భాస్కర్, నరేష్ వీకే తదితరులు
సంగీతం: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: శ్యామ్ ధూపాటి
ఎడిటింగ్: శ్రవణ్ కటినేని
నిర్మాత: బూసం జగన్ మోహన్ రెడ్డి
దర్శకుడు: భద్రప్ప గాజుల
దసరా రేసులో నిలబడిన చిన్న సినిమా క్రేజీ కళ్యాణం. అనుపమ పరమేశ్వరన్, అఖిల్ రాజ్, నరేష్ వీకే, తరుణ్ భాస్కర్ నటించిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
మెదక్‌లోని ఓ గ్రామంలో ఉండే పర్వతాలు (నరేశ్)కు ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయికి తాగుబోతు (తరుణ్ భాస్కర్) తో పెళ్లి జరుగుతుంది. అతనికి పనిపాటా ఉండదు, ఎప్పుడూ తాగుతూ మామ పరువు తీస్తుంటాడు. కనీసం రెండో కూతురుకైనా ఎలాంటి దురలవాట్లు లేని, మంచి ఆస్తిపరుడైన అల్లుడు రావాలని పర్వతాలు ఆశపడతాడు. కానీ చిన్న కూతురు కీర్తి (అనుపమ పరమేశ్వరన్) ఆలోచనలు వేరేలా ఉంటాయి. బాగా చదువుకుని ఉద్యోగం చేయాలని, తన కాళ్ల మీద తాను నిలబడాలని ఆమె లక్ష్యం. మరోవైపు చిన్నప్పటి నుంచి తన వెంటే తిరిగే ఉదయ్ (అఖిల్ రాజ్) అంటే కీర్తికి ఇష్టం. ఉదయ్ కూడా కీర్తిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తాడు. అయితే అతనికి ఎలాంటి ఉద్యోగం ఉండదు, పైగా పేదవాడు. ఇలాంటి కుర్రాడిని తన తండ్రి ఏమాత్రం అంగీకరించడని కీర్తికి తెలుసు. ఇంతలో పర్వతాలు తన చిన్న కూతురికి ఒక సంబంధం ఖాయం చేస్తాడు. ఆ పరిస్థితుల్లో కీర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఆ తర్వాత ఏమైంది? అనేదే ‘క్రేజీ కళ్యాణం’ మిగతా కథ.
కథనం:
కూతురి పెళ్లి కోసం ఒక తండ్రి పడే తపన నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ప్రతీ తండ్రి ఇలాగే ఆలోచిస్తాడు కాబట్టి ఈ పాయింట్ ప్రేక్షకులకు సులభంగా కనెక్ట్ అవుతుంది. అలాగే ఆడపిల్లలు తమ కాళ్లపై తాము నిలబడాలని, తల్లిదండ్రులు వారికి అండగా ఉండాలనే మంచి సందేశం కూడా ఇందులో ఉంది. కేవలం డబ్బున్న అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేసినంత మాత్రాన కుటుంబ పరువు దక్కదని, ఆడపిల్ల గౌరవం అనేది సొంత ఇంట్లోనే మొదలవుతుందని చెప్పిన విధానం బాగుంది. ఈ మెయిన్ పాయింట్, దానికి తోడు అనుపమ, నరేశ్, తరుణ్ భాస్కర్ లాంటి మంచి తారాగణం, తెలంగాణ పల్లెటూరి వాతావరణం అన్నీ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. దర్శకుడు, నిర్మాతలు ఈ కథపై చాలా నమ్మకంతోనే ప్రాజెక్ట్ మొదలుపెట్టి ఉంటారు. అయితే, కేవలం మంచి ఆలోచన ఉంటే సరిపోదు. కెమెరా ముందు నటీనటులు ఉన్నంత మాత్రాన ఎమోషన్స్ దానంతట అవే పండవు. రాసుకున్న కథనం బలంగా ఉండాలి, సన్నివేశాలు ఆసక్తికరంగా సాగాలి. ‘క్రేజీ కళ్యాణం’ లాంటి సినిమాలో ప్రేక్షకులు ఆశించేది ఇదే. కానీ సరిగ్గా ఇక్కడే సినిమా వెనకబడింది.
మొదటి అరగంట చాలా నెమ్మదిగా సాగుతుంది. పాత్రల పరిచయాలు, వాళ్ల ఉద్దేశాలు చెప్పడానికే చాలా సమయం తీసుకున్నారు. కీర్తి, ఉదయ్ మధ్య లవ్ స్టోరీ కూడా అంత ఆసక్తిగా అనిపించదు. తన అన్నయ్య కూతురికి వచ్చిన సంబంధాన్ని పర్వతాలు తన కూతురికి మళ్లించినప్పుడు అసలు కథ మొదలవుతుంది. అక్కడినుంచి కథనం వేగంగా సాగాలి, కానీ ఆ స్పీడ్ కాస్త తగ్గింది. ఇంటర్వెల్ బ్యాంగ్ పర్లేదు. తర్వాత ఏం జరుగుతుంది, కీర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలగదు. మధ్యలో తరుణ్ భాస్కర్ తో దర్శకుడు కొంత నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక సెకండాఫ్ లో హీరోయిన్ ఇంగ్లీష్ క్లాసులు చెప్పే ట్రాక్ కేవలం టైమ్ పాస్ కోసమే పెట్టినట్లు ఉంటుంది. పల్లెటూరి సీన్స్, తల్లి ట్రాక్ ఏవీ కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించవు. కానీ, చివరి అరగంట మాత్రం దర్శకుడు అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. నరేశ్ క్యారెక్టర్ చుట్టూ అల్లిన ఎమోషనల్ సీన్స్ సినిమాకు ప్రాణం పోశాయి. ఒక సుదీర్ఘమైన షాట్ లో నరేశ్ నటనకు థియేటర్లో చప్పట్లు పడతాయి. ఆడపిల్లలకు చదువు, ఉద్యోగం ఎంత ముఖ్యమో ఒక తండ్రి తెలుసుకునే ముగింపుతో దర్శకుడు తాను చెప్పాలనుకున్న పాయింట్ ను సక్సెస్ ఫుల్‌గా రీచ్ అయ్యాడు. అయితే చివర్లో అల్లుడి క్యారెక్టర్ కు ఎలివేషన్ ఇవ్వడం కోసం పెట్టిన ఫైట్ మాత్రం అతికించినట్లుగా అనిపిస్తుంది.
నటీనటులు:
అనుపమ పరమేశ్వరన్ తెలంగాణ యాసను చాలా చక్కగా పలికింది. పాత్రను పూర్తిగా అర్థం చేసుకుని, చిన్న చిన్న డీటైల్స్ కూడా మిస్ అవ్వకుండా అద్భుతంగా నటించింది. ఆమె పడ్డ కష్టానికి కచ్చితంగా ప్రశంసలు దక్కుతాయి. సీనియర్ నటుడు నరేశ్‌కు ఇది మంచి పాత్ర. పర్వతాలు క్యారెక్టర్‌కు ఆయన నూరు శాతం న్యాయం చేశాడు. ఒక దశలో సినిమా భారాన్నంతా తన భుజాలపై వేసుకున్నాడు. చివరి అరగంటలో నరేశ్ నటన సినిమాకే హైలైట్. తరుణ్ భాస్కర్ పాత్రతో ఇంకాస్త నవ్వించే అవకాశం ఉన్నా, దర్శకుడు దానిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అఖిల్ రాజ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, లవ్ స్టోరీలకు తను పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు.
టెక్నికల్ టీం:
చిన్న సినిమానే అయినా సాంకేతికంగా నిర్మాణ విలువలు బాగున్నాయి. సురేష్ బొబ్బిలి సంగీతం పర్లేదు. శ్యామ్ ధూపాటి కెమెరా పనితనం నీట్‌గా ఉంది. శ్రవణి కటినేని ఎడిటింగ్ విషయంలో తడబడ్డాడు. తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో పాటలు ఎక్కువయ్యాయనే ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడి ఉద్దేశం నిజాయితీగానే ఉన్నా, దాన్ని ఇంకాస్త ఆసక్తికరంగా తెరపై ప్రెజెంట్ చేసి ఉండాల్సింది. ఫస్ట్ హాఫ్‌ని ఇంకాస్త వినోదాత్మకంగా, ఎంగేజింగ్‌గా రాసుకునే అవకాశం ఉన్నా మేకర్స్ ఆ దిశగా ప్రయత్నించలేదు. సినిమాలో ఏవైనా లోపాలున్నా, క్లైమాక్స్ మాత్రం ‘క్రేజీ కళ్యాణం’ ను కాపాడిందనే చెప్పాలి. ఓవరాల్‌గా అనుపమ నటన, నరేశ్ వన్ మ్యాన్ షో సినిమాకు ప్లస్ అయ్యాయి. స్క్రిప్ట్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా క్రేజీ కళ్యాణం.. మరీ క్రేజీ కాదు కానీ నీట్‌గా సాగే పల్లెటూరి పెళ్లి డ్రామా..!






