బ్యాంకింగ్ రంగంలో గత కొంతకాలంగా నలుగుతున్న వారానికి 5 రోజుల పనిదినాల డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యంత స్పష్టమైన ప్రకటన వెలువడింది. బ్యాంక్ ఉద్యోగులకు 5 రోజుల పని దినాలపై ఎప్పుడూ ఎలాంటి హామీ ఇవ్వలేదని, వేతన ఒప్పంద చర్చల సమయంలో ఈ అంశమే అసలు చర్చకు రాలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తేల్చిచెప్పాయి. ప్రభుత్వ తాజా ప్రకటనతో బ్యాంక్ ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సెప్టెంబర్ 28 నుంచి బ్యాంక్ ఉద్యోగులు 3 రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమౌతున్న తరుణంలో ఆర్థిక శాఖ ఈ స్పష్టతనిచ్చింది. వారంలో 5 రోజుల పని అనేది ఎప్పుడూ చర్చల అజెండాలో లేదని, దాన్ని యూనియన్లు ఏకపక్షంగా ముందుకు తెచ్చాయే తప్ప ఇరు వర్గాల మధ్య ఎలాంటి అధికారిక ఒప్పందం కుదరలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. 2024 మార్చిలో కుదిరిన వేతన సవరణ ఒప్పందంలో భాగంగా శనివారాలను సెలవులుగా ప్రకటించేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంగీకరించిందని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నప్పటికీ.. కేంద్రం మాత్రం ఆ వాదనను పూర్తిగా తోసిపుచ్చింది.
ఆర్థిక శాఖ ప్రకటన బ్యాంక్ యూనియన్లలో తీవ్ర అసంతృప్తిని రగిలించింది. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కన్ఫెడరేషన్(AIBOC)తో సహా 9 ప్రధాన సంఘాల కూటమి అయిన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBU) దేశవ్యాప్తంగా 90 శాతానికి పైగా ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. 5 రోజుల వర్కింగ్ పై స్పష్టమైన కాలపరిమితితో కూడిన ప్రకటన వచ్చే వరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదని యూనియన్ నేతలు హెచ్చరిస్తున్నారు. దీనికితోడు సీనియర్ అధికారులకు సంబంధించిన పనితీరు ఆధారిత ప్రోత్సాహక(PLI) పథకంపై కూడా యూనియన్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి.
కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు..
ఈనెల 3 రోజుల సమ్మె కారణంగా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. సమ్మెకు ముందు రోజు వచ్చే ఆదివారం.. అంటే సెప్టెంబర్ 27న ప్రభుత్వ రంగ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ సాధారణ రోజుల్లో మాదిరిగానే పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. మెుత్తానికి 5 రోజుల పనిదినాల డిమాండ్ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేయడంతో, ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. బ్యాంక్ ఉద్యోగులు కూడా దీనిపై వెనక్కి తగ్గబోమంటూ పట్టుబడుతున్నారు.


