మన దేశ జాతీయ పక్షి నెమలి.. అందమైన రంగురంగుల ఈకలు, ఆకర్షణీయమైన నాట్యంతో చూపరులకు కనువిందు చేస్తుంది. వర్షాకాలంలో పురివిప్పి నాట్యం చేసే నెమలిని చూడటానికి రెండు కళ్లూ చాలవు. అయితే, ఈ అందమైన పక్షి రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతుంది? రాత్రిపూట ఎక్కడ విశ్రాంతి తీసుకుంటుంది? అనే విషయాలు మీకు తెలుసా? (Peacock Interesting Facts)
ఒక నివేదిక ప్రకారం, నెమలి రోజుకు సుమారు 9 నుంచి 12 గంటల వరకు నిద్రపోతుందని, సగటున 10 గంటల నిద్ర ఉంటుందని చెబుతారు. అయితే, ఈ నిద్ర సమయం అన్ని నెమళ్లకు ఒకేలా ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. వాతావరణ పరిస్థితులు, పరిసరాల ప్రభావం, వాటి భద్రత వంటి అంశాల ఆధారంగా నెమలి విశ్రాంతి సమయం మారే అవకాశం ఉంది.
నెమళ్లు సాధారణంగా పగటిపూట ఆహారం కోసం తిరుగుతూ చురుకుగా ఉంటాయి. సాయంత్రం కాగానే రాత్రి విశ్రాంతి కోసం ఎత్తైన చెట్ల కొమ్మలపైకి ఎగురుతాయి. రాత్రిపూట చెట్లపై నిద్రించడం వల్ల నేలపై సంచరించే వేటాడే జంతువుల నుంచి రక్షణ పొందే అవకాశం ఉందని భావిస్తాయి. కొన్ని సందర్భాల్లో గుంపులుగా చెట్లపై నెమళ్లు విశ్రాంతి తీసుకుంటాయి.
వేసవిలో పగటి సమయం ఎక్కువగా ఉండటం, శీతాకాలంలో రాత్రులు ఎక్కువగా ఉండటం వంటి మార్పులు పక్షుల దినచర్య, నిద్ర సమయంపై ప్రభావం చూపుతుంది. పగటిపూట నెమళ్లు ఆహారం వెతకడం, నీరు తాగడం, తిరగడం వంటి పనులు చేస్తాయి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నీడలో విశ్రాంతి తీసుకుంటాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెమళ్ల నిద్ర సమయాన్ని తగ్గిస్తుంది.
ఏదైనా కారణంగా నెమలి అభ్రదతకు గురైతే.. అది దాని నిద్ర సమయాన్ని తగ్గించే అవకాశముంది. రాత్రిపూట ఎత్తైన చెట్లపై విశ్రాంతి తీసుకోవడం వాటి సహజ రక్షణ పద్ధతుల్లో ఒకటి.


