Sai Krishna Case Update : గాదె సాయికృష్ణ అదృశ్యం, అనుమానిత లాకప్ డెత్ ఘటన ఏపీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు తాజాగా సంచలన తీర్పు వెల్లడించింది. సాయికృష్ణ లాకప్డెత్పై సీబీఐ విచారణకు కోర్టు ఆదేశించింది. ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతూ సాయికృష్ణ తల్లితోపాటు పలువురు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది. అదేవిధంగా సాయికృష్ణ తల్లి విజయ లక్ష్మికి రూ.25లక్షల పరిహారం నాలుగువారాల్లోపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
Also Read : AP Government : ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు భారీ ఊరట లభించినట్లే..!
విజయవాడకు చెందిన 25ఏళ్ల గాదె సాయికృష్ణను ఈ ఏడాది మే నెల మొదటివారంలో మార్కాపురం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుంచి అతను కనిపించకుండా పోయాడు. దీంతో అతని తల్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తన కుమారుడిని లాకప్ డెత్ చేశారని ఆరోపిస్తూ కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్తో పాటు సీబీఐ విచారణ కోరుతూ పిటీషన్ వేసింది.
ఈ కేసుపై ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. విచారణ జరిపిన అనంతరం డిజిటల్ ఆధారాలను మాయం చేసినట్టు సిట్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో గతంలోనే ఈ కేసు విషయంలో తగిన ఆదేశాలు ఇవ్వకపోతే తామే సీబీఐకి అప్పగిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పలు అంశాలపై హైకోర్టులో సుదీర్ఘ విచారణ అనంతరం తాజాగా.. సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐ విచారణకు అప్పగించింది.






