కోల్ కతాలోని చోర్ బాగ్లో దుర్గామాత పూజా పండాల్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 19 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనలో కేసునమోదు చేసిన పోలీసులు ఏడుగురు పండాల్ నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులుగా పండాల్ నిర్వాహకులపై భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సెక్షన్లు 105, 110, 3(5) కింద సుమోటో కేసు నమోదు చేశారు. ఇంకా కొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉంది.
ఈ కేసులో నిర్వాహకులు రాజ్ కుమార్ సేవ్డా , శాంతనుదుబే, బిప్లబ్ ముఖర్జీలతోపాటు జనాలను నియంత్రించడంలో విఫలమైనందుకు వీఐపీ పాస్ చెకింగ్ విభాగంలో కౌశిక్, పింటూ ఉన్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఇన్చార్జ్లు సుమన్ చక్రవర్తి, రాజేష్ పాల్ లను కూడా అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా , పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. ఈ ఘటనపై కోల్ కతా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా, గ్రూప్ డి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు కోల్ కతా పోలీసులు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజీని నిశితంగా పరిశీలిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారినిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.






