Telangana Weather : తెలంగాణలోని పలు జిల్లాల్లో గత వారం వర్షాలు దంచికొట్టాయి. అయితే, ప్రస్తుతం వర్షాలు ముఖంచాటేయడంతోపాటు.. ఎండల తీవ్రత పెరుగుతోంది. దీంతో ప్రజలు.. ముఖ్యంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని, కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Also Read : IND vs WI : మేము ఆ పెద్దతప్పు చేశాం.. అందుకే ఓడిపోయాం.. వెస్టిండీస్ కెప్టెన్ షైయ్ హోప్ కీలక కామెంట్స్
తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్టోబర్ 4, 5 తేదీల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. అదే సమయంలో భీకర గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత పెరిగింది. ఖమ్మంలో అత్యధికంగా 37.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. పలు ప్రాంతాల్లో 35డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేటి నుంచి మూడు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. 4, 5 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.






