☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

నీతికథ: చేదోడు వాదోడుగా జీవించాలి.. ఒకరికొకరు సాయంగా ఉంటేనే జీవితంలో వెలుగులు

నీతికథ: చేదోడు వాదోడుగా జీవించాలి.. ఒకరికొకరు సాయంగా ఉంటేనే జీవితంలో వెలుగులు
నీతికథ: చేదోడు వాదోడుగా జీవించాలి.. ఒకరికొకరు సాయంగా ఉంటేనే జీవితంలో వెలుగులు
నీతికథ: చేదోడు వాదోడుగా జీవించాలి.. ఒకరికొకరు సాయంగా ఉంటేనే జీవితంలో వెలుగులు

​మున్నేటి తీరంలో ఉన్న గంగాపురంలో మోహనరావు, ఆయన తొమ్మిదేళ్ల మనవడు ఆదిత్య బస్​ దిగారు. కాలినడకన ఊళ్లోకి బయలుదేరారు. పట్టణంలోని సిమెంట్ రోడ్లు, అపార్ట్‌‌మెంట్ల వాతావరణంలో పెరిగిన ఆదిత్యకు పల్లెటూరి పచ్చదనం, చల్లని గాలి ఎంతో హాయిగా అనిపిస్తున్నాయి. తాతయ్యతో కలిసి గ్రామానికి రావడం అతనికి ఒక కొత్త అనుభూతిని ఇస్తోంది. అలా ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ముందుకు సాగుతుండగా, గ్రామ సరిహద్దుల్లో ఒక చిన్న ఇంటి ముందు పెద్దగా అరుపులు, కేకలు వినిపించాయి.

​అక్కడేం జరుగుతుందో చూడాలనే కుతూహలంతో ఆదిత్య ఆ వైపుగా పరుగెత్తాడు. తాతయ్య కూడా నిదానంగా అతని వెనుకే వచ్చాడు. అక్కడ ఎనిమిదేళ్ల రాము, పదేండ్ల చందు అనే ఇద్దరు పిల్లలు ఒక చెక్క బొమ్మ కోసం గట్టిగా దెబ్బలాడుకుంటున్నారు. ‘‘ఇది నా బొమ్మ అంటే నా బొమ్మ’’ అని ఒకరినొకరు నెట్టుకుంటూ, ఏడుస్తూ రచ్చ చేస్తున్నారు. అంతలో లోపలి నుంచి రాము తండ్రి వెంకటేశం బయటకు వచ్చాడు. ఆయన ఆ ఇద్దరినీ దగ్గరకు తీసుకొని, కన్నీళ్లు తుడిచి ఊరడించాడు.

‘‘ ప్రతి చిన్న విషయానికీ ఇలా కొట్టుకోకూడదురా. ఇద్దరూ కలిసిమెలిసి ఉండాలి. అన్నదమ్ములు ఒకరికొకరు ‘చేదోడు వాదోడుగా’ ఉండాలి గానీ, ఇలా తగాదాలు పడితే పనులు కావు, కోపాలే మిగులుతాయి’’ అని సర్దిచెప్పాడు. తండ్రి మాటలతో ఆ పిల్లలు శాంతించి, ఒకరికొకరు సారీ చెప్పుకుని కలిసి ఆడుకోవడానికి పరుగెత్తారు.వెంకటేశం చెప్పిన మాటల్లో ‘చేదోడు వాదోడు’ అనే పదం ఆదిత్య మనసులో గట్టిగా నాటుకుపోయింది.

పట్టణంలో రోజూ వినే ఇంగ్లీష్ మాటలకు భిన్నంగా, ఎంతో తీయగా ఉన్న ఆ తెలుగు పదం అతనికి వింతగా అనిపించింది. ఆలోచనలో పడిన ఆదిత్య, తాతయ్య చేయి పట్టుకుని, ‘‘తాతయ్యా! ఆ అంకుల్ ఆ పిల్లలతో చేదోడు వాదోడుగా ఉండాలని అన్నారు కదా! అసలు ఆ పదానికి అర్థం ఏమిటి? దాని వెనుక ఏమైనా కథ ఉందా?’’ అని ఆసక్తిగా అడిగాడు.

ఆదిత్య జిజ్ఞాసకు తాతయ్య మురిసిపోయాడు. మనుమడికి విడమరిచి చెప్పడానికి సరైన ఉదాహరణ కోసం చుట్టూ చూశాడు. సరిగ్గా ఆ సమయానికి వారు నడుస్తున్న బాట పక్కనే ఒక పెద్ద గిరకబావి కనిపించింది.

అక్కడ కొందరు మహిళలు బావి నుంచి నీళ్లు తోడుతున్నారు. తాతయ్య ఆదిత్యను ఆ బావి దగ్గరకు తీసుకెళ్లి నిలబెట్టాడు. ‘‘ఆదిత్యా! అటు చూడు, ఆ బావిలో నీళ్లు తోడటానికి వాళ్లు ఏం ఉపయోగిస్తున్నారో నిశితంగా గమనించు’’ అని చెప్పాడు. ఆదిత్య ఆ దృశ్యాన్ని చూశాడు. అక్కడ ఒక ఇనుప బొక్కెన బావిలోకి వెళ్తోంది, దానికి ఒక లావుపాటి తాడు కట్టి ఉంది. పైనున్న ఆవిడ ఆ తాడును గిరక పైనుంచి లాగుతుంటే బావిలోని నీళ్లు నిండిన బొక్కెన పైకి వస్తోంది.

​తాతయ్య ఆ దృశ్యాన్ని చూపిస్తూ వివరంగా చెప్పడం ప్రారంభించాడు. ‘‘చూడు ఆదిత్యా! పూర్వకాలంలో బావి నుంచి నీళ్లు తోడటానికి వాడే బొక్కెనను ‘చేద’ అని పిలిచేవారు. అంటే చేతితో తోడేది కాబట్టి అది చేద అయింది. మరి ఆ చేద బావిలోని నీళ్లను పైకి తీసుకురావాలంటే దానికి ఒక గట్టి సాయం కావాలి. ఆ సాయమే ‘వాద’. వాద అంటే తాడు అని అర్థం.

బావిలో మునిగే చేదకు, పైకి లాగే తాడు తోడుగా ఉంటుంది. అందుకే ‘చేద-తోడు, వాద-తోడు’ అనే మాటలు వచ్చాయి. చేద ఉండి తాడు లేకపోయినా, తాడు ఉండి చేద లేకపోయినా బావి నుంచి నీటి బొట్టును కూడా పైకి తీయలేము. చేదకు వాద తోడైనప్పుడే బావి నీళ్లు బయటకు వచ్చి అందరి దాహం తీరుస్తాయి.’’

​తాతయ్య మాటలను ఆదిత్య ఎంతో శ్రద్ధగా విన్నాడు. తాతయ్య మరింత వివరిస్తూ, ‘‘మన జీవితం కూడా ఆ బావి, చేద, తాడు లాంటిదే! సమాజంలో ఏ ఒక్కరూ ఒక్కరిగానే అన్ని పనులనూ పూర్తి చేయలేరు. ఒకరి శ్రమకు మరొకరి సహకారం తోడవ్వాలి. ఒకరికి ఒకరు సాయపడటాన్ని, కష్టసుఖాల్లో తోడుగా నిలవడాన్ని సూచించడానికి మన పెద్దలు ఈ ‘చేదోడు వాదోడు’ అనే జాతీయాన్ని వాడుకలోకి తెచ్చారు. ఆ బొక్కెనకు తాడు ఎలాంటి బలాన్ని ఇస్తుందో, మనం ఒకరికొకరు చేసుకునే చిన్న చిన్న సహాయాలు కూడా జీవితంలో అంతటి గొప్ప వెలుగును నింపుతాయి’’ అని ముగించాడు. తాను కూడా బడిలో, ఇంట్లో అందరికీ చేదోడు వాదోడుగా ఉంటానని తాతయ్యకు మాట ఇచ్చాడు. ఇద్దరూ సంతోషంగా నవ్వుకుంటూ, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తమ ఇంటి వైపు అడుగులు వేశారు.

- డా. పోతగాని సత్యనారాయణ

మీరూ లైఫ్​కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతోపాటు
featureseditor@v6velugu.com కి మెయిల్​ చేయండి.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← ఆధ్యాత్మికం: మౌనంతో ఏదైనా సాధించవచ్చు..శ్రీకృష్ణుడు.. బుద్దుడు విజయానికి కారణం ఇదే..!బాలల మనస్తత్వశాస్త్రం: పిల్లలకు స్వేచ్ఛకన్నా స్పష్టతే ముఖ్యం.. ప్రేమతో పెట్టిన హద్దులే బలం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com