
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో సమాజం, సంబంధాలు, నైతికత , ప్రముఖ రచయిత్రి 'ఐన్ రాండ్' (Ayn Rand) సిద్ధాంతాలపై మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛ, మానవ సంబంధాలు, గిల్ట్ , రిలేషన్‌షిప్‌లలో వచ్చే మార్పులపై ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

తనకు ఇష్టమైన రచయిత్రి ఐన్ రాండ్ గురించి ఆర్జీవీ మాట్లాడుతూ, ఆమె ఆలోచనా విధానం ఎంత స్పష్టంగా ఉంటుందో వివరించారు. సమాజంలో మనుషులు పాటించే నైతిక విలువలు, భయాలు , చట్టాల గురించి మాట్లాడుతూ.. జీవితంలో నిజాయితీగా ఉండటమే గిల్ట్ ఫీలింగ్‌ను దూరం చేస్తుందని అభిప్రాయపడ్డారు. మనుషుల మధ్య జరిగే భావోద్వేగ ప్రయాణాలు, అభిప్రాయాలు మారుతుంటాయని, వాటిని ముందే స్పష్టంగా తెలపడంలో తప్పులేదని అన్నారు.

ప్రతి మనిషి తన సొంత ఆనందం కోసం, తనదైన జీవన శైలిని ఎంచుకునే హక్కు కలిగి ఉంటాడని ఆర్జీవీ పేర్కొన్నారు. రిలేషన్‌షిప్‌లలో వచ్చే సమస్యలు, మనసులు విడిపోవడం వంటి అంశాలపై మాట్లాడుతూ.. కేవలం సమాజం కోసం లేదా బంధాల ఒత్తిడితో నరకం అనుభవించడం కంటే, వాస్తవాలను అంగీకరించి ముందుకు వెళ్లడమే కరెక్ట్ అని ఆయన కుండబద్దలు కొట్టారు. మహిళల అందం, వారి వ్యక్తిత్వం , ఆలోచనా విధానంపై తనకు ఉన్న అభిప్రాయాలను కూడా ఆయన ఈ సందర్భంగా పంచుకున్నారు.

సమాజానికి నాలుగు స్తంభాలు అవసరమని ఆర్జీవీ అన్నారు: చట్టం (పోలీసింగ్), మతం (శక్తిని నమ్మడం ద్వారా భయం కలిగించడం), నైతికత (పక్కవారితో ఎలా వ్యవహరించాలి), నిబద్ధత (లాయల్టీ). ఈ వ్యవస్థలు ఒక కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఏర్పరచి, గిల్టీ ఫీలింగ్‌ను ప్రేరేపించడం ద్వారా సమాజంలో క్రమాన్ని కొనసాగిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

గిల్ట్‌ను అధిగమించడానికి నిజాయితీ, బహిరంగ సంభాషణలు కీలకమని ఆర్జీవీ బలంగా నమ్ముతారు. ఐన్ రాండ్ స్వయంగా దీనికి ఒక ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. 54 ఏళ్ల వయస్సులో ఐన్ రాండ్ 27 ఏళ్ల నాథనియల్ బ్రాండెన్తో ప్రేమలో పడినప్పుడు, తన భర్త ఫ్రాంక్ ఓకానర్, నాథనియల్ , అతని భార్య బార్బరాను పిలిచి, తన కోరికను బహిరంగంగా వ్యక్తం చేసింది. తన నిర్ణయాన్ని వారికే వదిలేసింది. ఈ నిజాయితీ గిల్ట్‌ను నివారిస్తుందని ఆర్జీవీ వివరించారు. లంచాలు లేదా వివాహేతర సంబంధాలు వంటి వాటి వల్ల కలిగే గిల్ట్ కూడా ఈ నిజాయితీతో కూడుకున్న బహిరంగ ప్రవర్తన ద్వారా తగ్గించవచ్చని ఆయన అన్నారు.





