కిన్నెరసాని అడవిలో ఎంతో కాలంగా ఒక ముసలి ఏనుగు జీవిస్తూ ఉండేది. అది అడవిలోని అన్ని జంతువులకు, పక్షులకు సాయం చేస్తూ, కష్టసమయాల్లో అండగా నిలబడేది. అందుకే జంతువులన్నీ ఏనుగును తమ పెద్దదిక్కుగా భావించి గౌరవించేవి. అయితే, ఏనుగుకు దక్కుతున్న ఆ ఆదరణను చూసి ఒక నక్క అసూయతో రగిలిపోయేది. స్వార్థ బుద్ధితో ఏనుగుపై పగ పెంచుకున్న ఆ నక్క, ఎలాగైనా దానికి చెడ్డపేరు తెచ్చి అడవి నుంచి తరిమికొట్టాలని ఎత్తుగడ వేసింది.
ఒకరోజు నక్క నీటి మడుగు వద్దకు వెళ్లి, అక్కడ నీళ్లు తాగుతున్న ఒక జింకతో గొంతు తగ్గించి రహస్యంగా మాట్లాడింది. ‘‘జింకా! నీకో భయంకరమైన నిజం తెలుసా? మన ఏనుగు తన బలమే సింహం బలంకన్నా ఎక్కువని, కావాలంటే నిరూపిస్తానని ఎలుగుబంటితో పందెం కట్టిందట. ఆ నెపంతో త్వరలోనే అడవిలోని పచ్చని చెట్లను విరిచేసి, చిన్న జంతువులన్నింటినీ కాళ్ల కింద తొక్కి నలిపేయాలని పన్నాగం పన్నింది. ఈ మాట స్వయంగా ఏనుగే గర్వంతో చెప్తుంటే నేను నా చెవులతో విన్నాను’’ అంటూ నమ్మేటట్టు నటించింది. ఆ మాటల్లో ఏమాత్రం నిజముందో ఆలోచించే విచక్షణ లేని ఆ అమాయకపు జింక, శత్రువైన నక్క పుట్టించిన అబద్ధాన్ని గుడ్డిగా నమ్మి వణికిపోయింది.
భయంతో బిగుసుకుపోయిన జింక వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి, ఎదురుపడ్డ నెమలితో చెప్పింది. ఆ నెమలి ఆత్రంగా వెళ్లి, కుందేళ్లు పక్షులతో చెప్పాయి. ఒకరి నుంచి ఒకరికి చేరేసరికి ఆ మాట మరింత పెద్దదైంది. నిజం తెలుసుకునే ఆలోచన లేని ఆ జంతువులన్నీ కలిసి, ‘‘ఏనుగు మారిపోయింది. మన ప్రాణాలకే ముప్పు వచ్చింది’’ అంటూ ఆ పుకారును అడవి నలుమూలలకు వేగంగా వ్యాపింపజేశాయి.
కొద్దిసేపట్లోనే ఆ మాటలు విన్న కోతులు, అడవి పందులు అసలు ఆలోచించకుండా ఆ పుకారునే నిజమని నమ్మేశాయి. ‘‘ఇంతమంది చెప్తున్నారంటే ఇందులో సందేహమే లేదు! మన ప్రాణాలు కాపాడుకోవాలంటే ఏనుగును ఇక్కడి నుంచి తరిమికొట్టాల్సిందే’’ అంటూ మూర్ఖంగా నిర్ణయించుకున్నాయి. ఆగ్రహంతో ఊగిపోతూ, కట్టెలూ రాళ్లూ చేతబట్టి ఏనుగు నివసించే కొండగుహ వైపు దూసుకెళ్లాయి.
ఈ కోలాహలాన్ని గమనించిన ఒక గుడ్లగూబ పెద్దగా అరుస్తూ జంతువుల గుంపు ముందుకు వచ్చి నిలబడింది. ‘‘ఆగండి! ఇంతకీ మీలో ఎవరైనా ఏనుగు ఆ మాటలు అనడం స్వయంగా విన్నారా? లేక అది ఎవరినైనా గాయపరచడం కళ్లారా చూశారా?’’ అని సూటిగా ప్రశ్నించింది. దాంతో జంతువులన్నీ బిక్కమొహం వేసి ఒకదానినొకటి చూసుకున్నాయి. కోతులు తాము కుందేళ్ల ద్వారా విన్నామన్నాయి. కుందేళ్లు నెమలి పేరు చెప్పాయి. చివరకు ఆ మాట జింక వద్దకు చేరింది. జింక వణుకుతూ, ‘‘నక్కే స్వయంగా నాతో ఈ మాట చెప్పింది’’ అని నిజం ఒప్పుకుంది. గుడ్లగూబ అందరినీ నక్క వైపు చూడమని చెప్పేసరికి, గుట్టు రట్టయిపోయిందని భయపడి ఆ నక్క పొదల్లోకి తోక ముడిచి పారిపోతూ అడ్డంగా దొరికిపోయింది.
అప్పుడు ఆ గుడ్లగూబ ‘‘చూశారా! అసూయతో రగిలే శత్రువు ఈ నిందను పుట్టించాడు. ఆలోచన లేని అజ్ఞానులు దీన్ని ప్రచారం చేశారు. బుద్ధి లేని మూర్ఖులు నిజమని నమ్మి మన శ్రేయోభిలాషినే తరిమేయడానికి సిద్ధపడ్డారు. ఎప్పుడైనా పుకార్లు అనేవి ఇలాగే ప్రచారం అవుతుంటాయి’’ అని అసలు విషయాన్ని వివరించింది. తమ తెలివితక్కువతనానికి సిగ్గుపడిన జంతువులన్నీ తలలు దించుకుని, ఏనుగు దగ్గరకు వెళ్లి క్షమాపణలు కోరాయి. అప్పటినుంచి ఎవరి మాటనైనా గుడ్డిగా నమ్మకూడదని, నిజం నిగ్గు తేల్చకుండా తొందరపడకూడదని అడవిలోని ప్రాణులన్నీ గుణపాఠం నేర్చుకున్నాయి.
- డా. పోతగాని సత్యనారాయణ


