కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. షెడ్యూల్ ప్రకారం శనివారం కర్ణాటకలోని హుబ్బళ్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. రూ.700 కోట్లతో నిర్మించిన కేఎల్‌ఈ జగద్గురు గంగాధర్ మహాస్వామిగళు మూరుసావిరమఠ్ మెడికల్ కళాశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించాల్సి ఉంది. అలాగే 1,200 పడకల కేఎల్ఈ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్‌ను కూడా ఆయన ప్రారంభోత్సవం చేయాల్సి ఉంది. ఈ కీలక కార్యక్రమాల కోసం ఆయన శుక్రవారం రాత్రే హుబ్బళ్లికి చేరుకున్నారు.
అయితే, హుబ్బళ్లిలోని హోటల్‌లో బస చేసిన సమయంలో ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు వెంటనే ఆయనను పరీక్షించి తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. వైద్యుల సలహా మేరకు ఆయన ఏ కార్యక్రమానికి హాజరుకాకుండా హోటల్‌లోనే విశ్రాంతి తీసుకున్నారు. కేంద్ర మంత్రి ఆరోగ్యం దృష్ట్యా ఆయన ఈ పర్యటనకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
అమిత్ షా గైర్హాజరైన నేపథ్యంలో ఆయా ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఇతర ప్రముఖులు నిర్వహించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కర్ణాటక వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్ ప్రకాశ్ పాటిల్, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై తదితరులు కలిసి ఈ మెడికల్ కళాశాలను, ఆసుపత్రిని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేఎల్‌సీ సొసైటీ ఛైర్మన్, రాజ్యసభ మాజీ ఎంపీ ప్రభాకర్ కోరే మాట్లాడారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉందని గుర్తుచేశారు. అయితే అనారోగ్య కారణాల రీత్యా ఆయన రాలేకపోయారని స్పష్టం చేశారు. అమిత్ షా త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆకాంక్షించారు.
The post కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అస్వస్థత ! appeared first on Adya News Telugu.


