Rahul Gandhi : ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో యాంటీ ఇండియా దషానన్ రావణ పేరుతో వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి. ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ సహా పలువురి ముఖాలతో ఈ పోస్టర్లు వెలిశాయి. ఇండియాకు వ్యతిరేక శక్తులుగా అభివర్ణిస్తూ ఈ పోస్టర్లు నగరంలోని అనేక ప్రాంతాల్లో వెలిశాయి.
మాజీ ఎంపీ, 2023లో మరణించిన ఎంపీ అతిక్ అహ్మద్ను రావణుడిగా చూపిస్తూ.. మిగతా ముఖాలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, యూఎస్ కాంగ్రెస్ మహిళ ఇల్హాన్ ఒమర్, బంగ్లాదేశ్ నేత ముహమ్మద్ యూనస్, జార్జ్ సోరోస్, ప్రశాంత్ భూషణ్, ముఖ్తర్ అన్సారి ముఖాలను దశ ముఖాలుగా చూపిస్తూ పోస్టర్లు వెలిశాయి. వీరంతా ఇండియాకు వ్యతిరేకంగా, దేశాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నుతున్నారని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. సనాతన్ రక్షా సంగటన్ సంస్థ తరఫున ఈ పోస్టర్లు వెలిసినట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్లలో ఉన్న వారంతా దేశానికి వ్యతిరేకులే అని సంస్థ పేర్కొంది.
దేశ రాజకీయాలు, సామాజిక వ్యవస్థలపై దాడి చేస్తున్నారని ఆరోపించింది. మస్క్ ఇండియాపై కుట్ర పన్నాడు అనేందుకు ఆయన చేసిన సోషల్ మీడియా పోస్టులే సాక్షాలు అని ఈ సంస్థ పేర్కొంది. ఇల్హాన్ ఒమర్ కూడా గతంలో ఇండియాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అలాగే, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పర్యటించిన విషయాన్ని గుర్తు చేసింది సనాతన్ రక్షా సంగటన్ సంస్థ. బంగ్లాదేశ్లో అధికార మార్పిడి కుట్రలో ముహమ్మద్ యూనస్ ఉన్నాడని, ఆయన కూడా ఇండియకు వ్యతిరేకంగా పని చేస్తారని సంస్థ వివరించింది. ఇక, ఇండియాకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో నిత్యం వినిపించే పేరు అమెరికాకు చెందిన జార్జ్ సోరోస్.
ఇండియాలో ఏదో ఒక అలజడి, అల్లర్లు సృష్టిస్తూ దేశాన్ని జార్జ్ సోరోస్ అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తుంటాడనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది. ప్రతిపక్షాలుగా రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ కూడా అదే లక్ష్యంతో పని చేస్తారని సంస్త పేర్కొంది. దీంతో వారందరి ఫొటోలతో రావణుడి తలలను పోలిన పోస్టర్లతో ఈ సంస్థ పోస్టర్లు రూపొందించింది.






