Sensory Overload | ప్రస్తుత జీవనశైలిలో ట్రాఫిక్ శబ్దాలు, ప్రకాశవంతమైన దీపాలు, రద్దీగా ఉండే ప్రదేశాలు, ఘాటైన వాసనలు, ఒకేసారి పలువురు మాట్లాడడం వంటి అనేక ఉద్దీపనలను మన మెదడు నిరంతరం స్వీకరిస్తుంటుంది. అయితే, ఒకేసారి అందే సమాచారాన్ని మెదడు సులభంగా విశ్లేషించలేని పరిస్థితిని సెన్సరీ ఓవర్లోడ్ అంటారు. ఇలాంటి సమయంలో కొందరు ఆందోళన, చిరాకు, ఒత్తిడికి గురవుతారు. ఇది కేవలం శబ్దాలు నచ్చకపోవడం లేదా ఏకాగ్రత తగ్గడం మాత్రమే కాదు. పరిసరాల నుంచి వచ్చే సమాచారంలో ముఖ్యమైన అంశాలను గుర్తించడం, మిగిలిన వాటిని పక్కనపెట్టడం, ఒత్తిడికి శరీరం స్పందించే తీరును నియంత్రించడం వంటి ప్రక్రియలు కూడా దీనిలో భాగంగా ఉంటాయి. ఈ పరిస్థితి తీవ్రతరం అయితే కొందరు ఏడవడం, అరవడం, ఇతరులకు దూరంగా ఉండడం లేదా తమ భావాలను సరిగ్గా వ్యక్తం చేయలేకపోవడం వంటి లక్షణాలను చూపుతారు.
మెదడులోని వ్యవస్థలపై ప్రభావం..
సెన్సరీ ఓవర్లోడ్ సమయంలో మెదడులోని పలు వ్యవస్థలు ప్రభావితమవుతాయి. శబ్దాలు, దృశ్యాలు, వాసనలు ఒకేసారి ఎక్కువగా అందినప్పుడు వాటిలో ముఖ్యమైనవాటిని వేరు చేయడం మెదడుకు కష్టమవుతుంది. దీంతో ఏకాగ్రత తగ్గి, స్పష్టంగా ఆలోచించడం, పరిసరాలకు తగిన విధంగా స్పందించడం ఇబ్బందిగా మారుతుంది. అదే సమయంలో ప్రమాదాలను గుర్తించి భావోద్వేగ ప్రతిస్పందనలను నియంత్రించడంలో పాత్ర పోషించే మెదడులోని అమిగ్డాలా భాగం అప్రమత్తమవుతుంది. ఒత్తిడి పెరగడంతో అడ్రినలిన్, కార్టిసాల్ వంటి హార్మోన్ల స్థాయిలు పెరిగి గుండె వేగంగా కొట్టుకోవడం, శరీరంలో బిగుతు, ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిర్ణయాలు తీసుకోవడం, భావోద్వేగాలను నియంత్రించడం, ఆలోచనలను క్రమబద్ధీకరించడంలో సహాయపడే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ పనితీరు కూడా తీవ్రమైన ఒత్తిడి సమయంలో తగ్గే అవకాశం ఉంది. ఫలితంగా వ్యక్తి తన భావాలను అదుపు చేసుకోవడం, ఇతరులతో స్పష్టంగా మాట్లాడడం కష్టంగా భావిస్తారు.
ఎప్పుడు వస్తుంది..
పరిసరాలు నియంత్రణలో లేవని లేదా వాటి నుంచి బయటపడలేమని మెదడు భావించినప్పుడు సెన్సరీ ఓవర్లోడ్ ఆందోళనను మరింత పెంచుతుంది. అధిక శబ్దాలు, వెలుతురు, రద్దీ నుంచి తప్పించుకోలేకపోతున్నామనే భావనతో గుండె వేగంగా కొట్టుకోవడం, కండరాలు బిగుసుకుపోవడం, భయాందోళనలు, చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు వస్తాయి. ఆందోళన పెరిగిన కొద్దీ పరిసరాల నుంచి వచ్చే సమాచారాన్ని తట్టుకోవడం మరింత కష్టమవుతుంది. ఈ పరిస్థితి తీవ్రమైనప్పుడు సెన్సరీ మెల్ట్డౌన్ సంభవిస్తుంది. ఇది కావాలని చేసే ప్రవర్తన కాదు, అధిక ఉద్దీపనను తట్టుకోలేక నాడీ వ్యవస్థ అనియంత్రితంగా స్పందించే పరిస్థితి. ఆ సమయంలో వ్యక్తి ఏడవడం, అరవడం, ఇతరుల నుంచి దూరంగా వెళ్లడం లేదా మాట్లాడలేకపోవడం వంటివి చేస్తారు. ఆటిజం ఉన్న కొందరు వ్యక్తులు, ఏకాగ్రత లోపం-అతి చురుకుదనం సమస్య (ఏడీహెచ్డీ) ఉన్నవారు, మైగ్రేన్తో బాధపడేవారు, ఆందోళన ఎక్కువగా ఉన్నవారు ఈ సమస్యకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది.
ఏం చేయాలి..
అయితే, సెన్సరీ ఓవర్లోడ్ ఎవరికైనా ఎదురవుతుంది. నిద్రలేమి, అలసట, మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు పరిసరాల నుంచి వచ్చే ఉద్దీపనలను తట్టుకునే సామర్థ్యం తగ్గుతుంది. ఒకరికి ఇబ్బందిగా అనిపించే శబ్దాలు లేదా వెలుతురు మరొకరికి సాధారణంగా అనిపిస్తాయి. అందువల్ల ప్రతి వ్యక్తి స్పందనను ఒకే విధంగా అంచనా వేయకూడదు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు శబ్దాలు, ప్రకాశవంతమైన వెలుతురు, రద్దీ వంటి ఉద్దీపనలను తగ్గించి, ప్రశాంతమైన ప్రదేశంలో కొంత సమయం విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించడం ఉపయోగకరంగా ఉంటుంది. నాడీ వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకునేందుకు సమయం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ లక్షణాలు తరచూ కనిపిస్తూ రోజువారీ జీవితం, పని లేదా సంబంధాలపై ప్రభావం చూపిస్తే వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.






