Asian Games 2026: ఆసియా క్రీడలు (Asian Games 2026) మహిళల కబడ్డీ విభాగంలో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. టోకై సిటిజన్స్ జిమ్నాసియంలో జరిగిన ఉత్కంఠభరితమైన సెమీఫైనల్ పోరులో ఇండియన్ ఉమెన్స్ కబడ్డీ టీమ్ 48–24 తేడాతో నేపాల్‌ను చిత్తు చేసి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. 2010లో ఆసియా క్రీడల్లో మహిళల కబడ్డీ ప్రవేశపెట్టిన నాటి నుంచి, భారత్ ఆడిన ఐదు సార్లు కూడా ఫైనల్‌కు అర్హత సాధించడం విశేషం.
నేపాల్‌పై పూర్తి ఆధిపత్యం:
గ్రూప్-ఏ లో అజేయ రికార్డ్‌తో సెమీస్‌లోకి అడుగుపెట్టిన టీమిండియా, నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరంభం నుంచే పట్టుబిగించింది. భారత డిఫెన్స్ పటిష్టంగా వ్యవహరించి నేపాల్‌కు ఈజీ బోనస్ పాయింట్లు ఇవ్వకుండా కట్టడి చేసింది. మరోవైపు ఇండియన్ రెయిడర్లు పూజ, సంజు దేవి, సోనాలి విష్ణు షింగేట్ వరుస పాయింట్లతో ప్రత్యర్థి జట్టుపై బాగా ఒత్తిడి పెట్టారు.
హోరాహోరీగా ఫస్ట్ హాఫ్:
నేపాల్ రెయిడర్ గంగ ఘిమిరే కొన్ని అద్భుతమైన రెయిడ్స్‌తో మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చారు. గంగ సాధించిన ఒక సంచనాత్మక ఫోర్-పాయింట్ సూపర్ రెయిడ్ ద్వారా నేపాల్ స్కోరును సమీపించే ప్రయత్నం చేసింది. కానీ, వెంటనే తేరుకున్న భారత్ ప్రత్యర్థిని ఆల్-అవుట్ చేసి ఆధిక్యాన్ని పెంచుకుంది. ఆ తర్వాత సంజు దేవి మరో అద్భుతమైన త్రీ-పాయింట్ సూపర్ రెయిడ్‌తో స్కోరును 25–15కి చేర్చింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి టీమిండియా 31–17ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
రెండో అర్ధభాగంలోనూ తగ్గని జోరు:
రెండో అర్ధభాగంలో భారత డిఫెన్స్ మరింత దూకుడుగా ఆడింది. భావనా దేవి, సంజు దేవి తమ అనుభవజ్ఞులైన ఆటతో నేపాల్ రెయిడర్లను సమర్థవంతంగా అడ్డుకున్నారు. వ్యూహాత్మకంగా ఆడిన టీమిండియా కబడ్డీ జట్టు మరోసారి నేపాల్‌ను ఆల్-అవుట్ చేసి ఆధిక్యాన్ని మరింత దూరం తీసుకెళ్లింది. చివరకు 48– 24 తేడాతో పూర్తి ఆధిక్యంతో విజయాన్ని ఖాయం చేసుకుంది.
స్వర్ణ పతక పోరుకు సర్వం సిద్ధం:
ఈ విజయంతో భారత్ మరోసారి స్వర్ణ పతకానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. రేపు (సెప్టెంబర్ 26, శనివారం) జరిగే ప్రతిష్టాత్మక గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో ఇండియా, ఇరాన్ లేదా చైనీస్ తైపీ జట్లలో ఒకదానితో తలపడనుంది. కాగా, ఈ టోర్నమెంట్‌లో కాంస్య పతక పోరు ఉండదని, సెమీఫైనల్స్‌లో ఓడిన రెండు జట్లు పోడియం స్థానాలను దక్కించుకుంటాయని ఆసియా గేమ్స్ నిర్వాహకులు వెల్లడించారు.


