హైదరాబాద్: తెలంగాణలో కొత్త పోలీసు ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 2025 అక్టోబర్ నాటికే 16 వేల పోలీస్ ఉద్యోగాలు నియమించడం జరిగిందని, 2026లో మరో 7 వేల 437 పోస్టులు అనుమతి ఇచ్చామని ఆయన తెలిపారు. 2028 నాటికి పోలీస్ శాఖలో ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పారు. మన కోసం జీవితాలను త్యాగం చేసిన వారిని మనందరం స్మరించుకుందామని సీఎం పిలుపునిచ్చారు.
అక్టోబర్ 21న దేశ వ్యాప్తంగా పోలీసు అమరుల దినం జరుపుకుంటున్నామని.. 2026లో దేశ వ్యాప్తంగా 154 మంది విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ప్రజల రక్షణ కోసం వారు చేసిన త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేమని, అమరవీరులకు హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నానని సీఎం చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అమరులైన వారి కుటుంబాలు ఒంటరి కావని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని.. వారి భవిష్యత్తు అవసరాల కోసం బాధ్యతగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. వారి పిల్లల చదువులకు ఆర్థికంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పరిశ్రమలు రోడ్లు భవనాలు నిర్మిస్తే అభివృద్ధి సాధ్యం కాదని, శాంతి భద్రతలు ఉండాలని, ప్రజలు నిర్భయంగా జీవించినప్పుడే అభివృద్ధి చెందినట్లు లెక్క అని సీఎం రేవంత్ చెప్పారు. అందుకే రాష్ట్ర అభివృద్ధిలో తెలంగాణ పోలీస్ శాఖ కీలకంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.






