LPG Cylinder Price Hike : పండుగల సీజన్‌లో గ్యాస్ వినియోగదారులకు ఊహించని షాక్ తగిలింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ధరలతో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాటరింగ్ వ్యాపారాలపై అదనపు భారం పడనుంది. ముఖ్యంగా విజయవాడలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.3 వేల మార్క్‌ను దాటేసింది. ఇప్పటికే పండుగ ఖర్చులతో సతమతమవుతున్న వేళ.. ఈ పెంపుతో స్వీట్లు, టిఫిన్లు, హోటల్ ఆహార ధరలపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో వినియోగదారుల్లోనూ ఆందోళన మొదలైంది.
వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో.. దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.62.50 పెరిగింది. దీంతో ఇప్పటివరకు రూ.2,747.50గా ఉన్న ధర రూ.2,810కి చేరింది. సెప్టెంబర్‌లోనూ ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్‌పై రూ.9.50 పెంపు జరిగింది. దీంతో వరుసగా రెండో నెలలోనూ వాణిజ్య ఎల్‌పీజీ వినియోగదారులపై అదనపు భారం పడింది. తాజా పెంపుతో ముఖ్యంగా విజయవాడలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.3 వేల మార్క్‌ను దాటడం వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
విజయవాడలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మరింత పెరిగింది. 19 కిలోల సిలిండర్‌పై రూ.69 పెంపు అమలులోకి వచ్చింది. దీంతో రూ.2,932.50గా ఉన్న ధర రూ.3,001.50కి చేరింది. అంటే విజయవాడలో వాణిజ్య సిలిండర్ ధర తొలిసారిగా రూ.3 వేల మార్క్‌ను దాటింది. హైదరాబాద్‌లోనూ కమర్షియల్ సిలిండర్ గ్యాస్ ధర పెరిగింది. తాజా పెంపుతో ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,065కు చేరినట్లు తెలుస్తోంది. అయితే, పూర్తిస్థాయి ధరల వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం దేశంలోని పలు రాష్ట్రాల్లో కమర్షియల్ సిలిండర్ ధరల వివరాలను పరిశీలిస్తే.. బెంగళూరు రూ.2,898, చెన్నై రూ. 2,983, కోల్ కతా రూ.2,954, ముంబై రూ.2,764, ఢిల్లీ రూ.2,810, హైదరాబాద్ రూ. 3,065, విజయవాడ రూ. 3,001.50.
గృహ వినియోగదారులకు ఊరట..
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగ్గా.. మరోవైపు 14.2 కిలోల గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. విజయవాడలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.966.50 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్ లో రూ.994.00 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ గృహ వినియోగ సిలిండర్ ధర రూ.942 వద్ద యథాతథంగా ఉంది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో అస్థిరత కొనసాగుతోంది. అంతర్జాతీయ ధరలు, రూపాయి-డాలర్ మారకపు విలువ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఎల్‌పీజీ ధరలను ఈ నెలలో కూడా పెంపు చేశాయి.






