
విజయవాడ శాప్ కార్యాలయం వద్ద డీఎస్సీ ఉపాధ్యాయులపై వైసీపీ శ్రేణులు జరిపిన భౌతిక దాడి ఉదంతం తీవ్ర దుమారం రేపుతోంది. విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులపై, అందులోనూ మహిళా టీచర్లు అని కూడా చూడకుండా నడిరోడ్డుపై బూతులు తిడుతూ భౌతిక దాడులకు తెగబడటం అత్యంత దారుణమని సమాజంలోని అన్ని వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేవలం రాజకీయ స్వార్థం కోసం, ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ కష్టపడి కొలువులు సాధించిన వారిపై రౌడీయిజం చేయడం ఎంతవరకు సమంజసమని మేధావులు ప్రశ్నిస్తున్నారు.
ఈ అనాగరిక చర్య వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులలో మరియు లక్షలాది మంది నిరుద్యోగులలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎంతో కష్టపడి, రాత్రింబవళ్లు చదివి ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే.. దానికి సమాజంలో దక్కే గౌరవం ఇదేనా అని నిరుద్యోగ యువత సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశ్నిస్తోంది. తాము ఎన్నో త్యాగాలు చేసి రేపు ఉద్యోగాలు సాధించుకున్నాక, ఏదో ఒక రాజకీయ పార్టీ తమ స్వప్రయోజనాల కోసం ఇలాగే రోడ్లపైకి వచ్చి దాడులు చేస్తూ రచ్చ చేస్తారా? తమకు ఉద్యోగ భద్రత, ప్రాణ రక్షణ కరువవుతుందా? అంటూ నిరుద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘోర ఉదంతంపై అటు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి. విధుల్లో ఉన్న సిబ్బందిపై, ఉపాధ్యాయులపై ఇలాంటి దౌర్జన్యాలు జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరిస్తున్నాయి. రాజకీయ పగ ప్రతీకారాల కోసం అమాయక ఉద్యోగులను, నిరుద్యోగులను బలిపశువులను చేసే దిగజారుడు రాజకీయ పంథాను వీడాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ దాడికి పాల్పడిన రౌడీ మూకలపై పోలీసులు కేవలం కేసులు పెట్టడమే కాకుండా, తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, అప్పుడే నిరుద్యోగుల్లో, ఉద్యోగుల్లో నమ్మకం కలుగుతుందని స్పష్టం చేస్తున్నాయి.
The post బెజవాడలో వైసీపీ తప్పు చేసిందా..? appeared first on Telugu Rajyam.





