కలలు కనడం సులువే కానీ వాటిని సాకారం చేసుకోవడం చాలా కష్టం. అందులోనూ ఆర్థిక ఇబ్బందులు అడ్డుపడితే ఆ కలలు నెరవేరడం దాదాపు అసాధ్యం. కానీ కేరళకు చెందిన ఓ యువకుడు మాత్రం తన కలను నిజం చేసుకోవడానికి పట్టువదలని విక్రమార్కుడిలా మారాడు. చిన్నప్పుడు చదువు మొదలు.. కెరీర్ వరకు అతడిని కష్టాలు వెంటాడుతూనే వచ్చాయి. ఇంజనీరింగ్‌లో ఏకంగా 20 బ్యాక్‌లాగ్స్.. పొట్టకూటి కోసం జొమాటో డెలివరీ బాయ్ అవతారం… డబ్బులు సరిపోక.. ట్రక్ డ్రైవర్‌గా ప్రయాణం… కెరీర్ తనను ఎన్ని మలుపులు తిప్పినా సరే.. తన కలను మాత్రం వదులుకోలేదు. ఇంతకీ అతను కన్న కలేంటి… దాన్ని ఎలా సాధించాడు?
కేరళ త్రిస్సూర్ జిల్లా కొడంగల్లూర్ ప్రాంతానికి చెందిన హైజిల్ జెబీ ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. తండ్రి విదేశాల్లో టైపిస్ట్ గా పనిచేసేవాడు, తల్లి గృహిణి. పదో తరగతి వరకు అతనికి ఎలాంటి కెరీర్ లక్ష్యం లేదు. అప్పట్లో ఓ స్నేహితుడు ఏవియేషన్ రంగం గురించి చెప్పడంతో విమానాలు చూడటంపై ఆసక్తి పెంచుకున్నాడు. అయితే బంధువులు… కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా ఏవియేషన్ కాకుండా ఇంజనీరింగ్ లో చేరాల్సి వచ్చింది.
మున్నార్ లోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కోర్సులో చేరాడు. ఆ కోర్సుపై అసలు ఆసక్తి లేకపోవడంతో చదువు ముందుకు సాగలేదు. ఏదో కాలేజీకి వెళ్తున్నామా.. ఇంటికొస్తున్నామా అన్నట్టు ఉండేది అతని వ్యవహారం. పరీక్షల్లో వరుసగా ఫెయిల్ కావడంతో ఏకంగా 20 సబ్జెక్టులు బ్యాక్లాగ్స్గా మిగిలిపోయాయి. వాటిని గట్టెక్కించడానికి మనవాడు పుస్తకాలతో చాలా పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో చేరాలని ప్రయత్నాలు ప్రారంభించాడు.
ఇంజనీరింగ్ పూర్తయ్యాక సరైన ఉద్యోగం రాకపోవడంతో ఖాళీగా ఉండటం ఇష్టం లేక కొచ్చిలో జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేశాడు. ఆ ఉద్యోగం వల్ల కొత్త ప్రదేశాలు చూడటంతో పాటు జీవితాన్ని ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకున్నాడు. ఆ తర్వాత బెంగళూరు వెళ్లి బైజూస్‌లో మ్యాథమెటిక్స్ టీచర్‌గా చేరాడు. ఉద్యోగం చేస్తూనే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యాడు. అయితే కొన్ని దశలు దాటినా ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో అతనికి చోటు దక్కలేదు.
జీవితం కొద్దిగా గాడిన పడుతుందనుకున్న సమయంలో కరోనా మహమ్మారి జెబీ జీవితాన్ని కుదిపేసింది. దుబాయ్ లో ఉన్న తండ్రికి గుండెపోటు రావడంతో ఆయన కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత 2021 జూన్ లో తండ్రి కన్నుమూయడంతో కుటుంబ భారం జెబీపై పడింది. సరిగ్గా అదే సమయంలో బైజూస్ సంస్థ ఉద్యోగులను తొలగించడంతో జెబీ రోడ్డున పడ్డాడు. కుటుంబాన్ని పోషించేందుకు ట్రక్ డ్రైవర్‌గా.. బస్సు డ్రైవర్‌గా… ఆఫీస్ స్టాఫ్‌గా పనులు చేశాడు.
వయసు పెరగడంతో ఆర్మ్డ్ ఫోర్సెస్ లో చేరే అవకాశాలు కూడా మూసుకుపోయాయి. చివరకు పదేళ్లుగా తన మదిలో ఉన్న ఏవియేషన్ కలను సాకారం చేసుకునేందుకు పైలట్ ట్రైనింగ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే పైలట్ ట్రైనింగ్ కోసం లక్షల్లో డబ్బు అవసరం కావడంతో ఎడ్యుకేషన్ లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగాడు. ఒక బ్యాంకు ఏకంగా ఏడాదిన్నర పాటు డాక్యుమెంట్లను పెండింగ్‌లో పెట్టి తీవ్రంగా విసిగించింది. చివరకు యూనియన్ బ్యాంక్ నుంచి ఎడ్యుకేషన్ లోన్ మంజూరు కావడంతో ఊపిరి పీల్చుకున్నాడు.
పైలట్ ట్రైనింగ్ కోసం జెబీ ఏకంగా ఫిలిప్పీన్స్ పయనమయ్యాడు. అక్కడ ఫాస్ట్ ఏవియేషన్ అకాడమీలో చేరి పైలట్ గా శిక్షణను ప్రారంభించాడు. కొత్త వాతావరణం అలవాటు పడటానికి కష్టమైనా పట్టుదలతో తనను తాను పూర్తిగా మెరుగుపరుచుకున్నాడు. చివరకు చిన్ననాటి కలను సాకారం చేసుకున్నాడు. పైలెట్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. చిన్న చిన్న కష్టాలకే ప్రాణాలు తీసుకునే వాళ్లకు… ఎలాంటి గమ్యం లేకుండా జీవితాన్ని కాలక్షేపంతో వృధా చేసుకునే వాళ్లకు జెబీ లైఫ్… మంచి ఇన్స్పిరేషన్


