కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం 2025-26కి గాను అర్హులైన తపాలా శాఖ ఉద్యోగులకు, గ్రామీణ డాక్ సేవకులకు (GDS) పర్ఫార్మెన్స్ లింక్డ్ బోనస్ (PLB) , ఎక్స్-గ్రేషియా బోనస్ ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS), గ్రూప్ C, నాన్-గెజిటెడ్ గ్రూప్ B ఉద్యోగులతో పాటు జీడీఎస్ సిబ్బందికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుంది. ఈ బోనస్ లెక్కింపును 60 రోజుల వేతనం ప్రాతిపదికన చేపట్టనున్నారు. అయితే బోనస్ గణన కోసం గరిష్ట పరిమితిగా నెలకు రూ.7,000 వేతనాన్ని ప్రామాణికంగా నిర్ణయించారు. ఈ లెక్కన అర్హత కలిగిన ఉద్యోగులకు గరిష్టంగా దాదాపు రూ.13,816 వరకు బోనస్ లభించే అవకాశం ఉంది.
ఈ బోనస్ లెక్కింపు సూత్రం ప్రకారం.. సగటు నెలవారీ వేతనాన్ని 60తో గుణించి, ఆపై 30.4తో భాగించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం వేతనంలో బేసిక్ పే, కరువు భత్యం (DA) వంటి కొన్ని రకాల భత్యాలను కూడా చేర్చుతారు. ఒకవేళ ఉద్యోగి వాస్తవ జీతం రూ.7,000 కంటే ఎక్కువ ఉన్నప్పటికీ, బోనస్ లెక్కింపుకు మాత్రం రూ.7,000 మాత్రమే గరిష్టంగా పరిగణిస్తారు. గ్రామీణ డాక్ సేవకులకు కూడా వారి TRCA , డీఏ ఆధారంగా సగటు నెలవారీ సంపాదనను లెక్కించి, గరిష్టంగా రూ.13,816 వరకు ఎక్స్-గ్రేషియాగా చెల్లిస్తారు.
అంతే కాకుండా.. ఈ ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 1, 2025 నుండి మార్చి 31, 2026 మధ్య) పదవీ విరమణ చేసిన, రాజీనామా చేసిన లేదా డెప్యుటేషన్పై వెళ్లిన అర్హులైన ఉద్యోగులకు కూడా వారు పనిచేసిన కాలానికి నిష్పత్తి ప్రకారం బోనస్ చెల్లిస్తారు. అయితే అసాధారణ సెలవులు తీసుకున్న వారి బోనస్లో కోత విధించే అవకాశం ఉంది. ఉద్యోగుల సర్వీసు కాలం, వారి సగటు అర్హత వేతనం ఆధారంగా వచ్చే అసలు బోనస్ మొత్తంలో స్వల్ప తేడాలు ఉండవచ్చు. దీపావళి పండుగ వేళ తపాలా శాఖ ఉద్యోగులకు ఈ ప్రకటన గొప్ప ఊరటనిచ్చింది.






