మంచిర్యాల: రెండు రోజుల క్రితం దండేపల్లి మండలం తాళ్లపేట గిరిజన సర్పంచ్పై దాడి జరిగిన క్రమంలో రెండు రోజులుగా తాళ్లపేట గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. నాలుగు రోజులుగా మంచిర్యాల జిల్లాలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇవ్వాళ(అక్టోబర్ 21) మంచిర్యాల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మంతెన జగన్మోహన్రావు ఇంటి చుట్టూ భారీగా పోలీసుల మోహరించారు.
జగన్మోహన్రావు పై ఓ వర్గం దాడికి ప్లాన్ చేశారనే సమాచారంతో ముందస్తుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జగన్మోహన్రావు ఇంటి చుట్టూ పోలీసులు రక్షణగా నిలిచారు. రామగుండం సీపీ ఆదేశాల మేరకు ఆంక్షలు కొనసాగుతున్నాయి. దసరా సంబరాల వేళ మంచిర్యాల జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మంచిర్యాల పట్టణ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. హై పోలీస్ సెక్యూరిటీ మధ్య జగన్మోహన్రావు ఇల్లు దిగ్బంధంలో ఉంది.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో ఆదివారం రాత్రి సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా పటాకులు కాల్చడంతో ప్రారంభమైన వివాదం కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. తాళ్లపేట స్టేజీ దగ్గర మహిళలు బతుకమ్మ ఆడుతుండగా, కాంగ్రెస్ నేత ఆకుల దుర్గాప్రసాద్ వారి సమీపంలో పటాకులు కాల్చడంతో వివాదం మొదలైంది. వారించిన సర్పంచ్ కుర్సింగ కళావతితో పాటు మహిళలపై దురుసుగా ప్రవర్తించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది.
ALSO READ : చీర కట్టులో.. AK 47తో IPS అంకిత శర్మ కాల్పులు
సమాచారం అందుకున్న లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి, లక్సెట్టిపేట, జన్నారం ఎస్సైలు రాజవర్ధన్, సురేశ్, ఉదయకిరణ్ పోలీసు బలగాలతో అక్కడికి చేరుకుని లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో సర్పంచ్ కళావతిపై సీఐ దాడి చేశారని గ్రామస్తులు ఆరోపించారు. పోలీసుల తీరును నిరసిస్తూ మంచిర్యాల-, నిర్మల్ మెయిన్‌రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మంతన జగన్‌మోహన్‌రావు, గిరిజన సహకార ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొట్నాక తిరుపతి బాధితులను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు.


