హైదరాబాద్: బతుకమ్మతో పాటు రానున్న పండుగల వేళ నగర ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయాలు లేకుండా, రహదారులపై సీవరేజ్ ఓవర్‌ఫ్లో సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరోవైపు నిర్మాణ రంగం, పార్కులు, ల్యాండ్‌స్కేపింగ్ వంటి అవసరాల కోసం శుద్ధి చేసిన మురుగునీటిని అందించే గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలను నవంబర్ 1 నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేయాలని సూచించారు.
పండుగల వేళ ప్రత్యేక నిఘా
ఆదివారం జలమండలి ఉన్నతాధికారులతో జూమ్ ద్వారా నిర్వహించిన సమీక్షలో నీటి సరఫరా, సీవరేజ్ నిర్వహణ, ఎస్టీపీల పనితీరు, ట్యాంకర్ల నమోదు, రానున్న వేసవి కార్యాచరణ ప్రణాళికలపై చర్చించారు. ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రాంతాలు, ప్రధాన రహదారులు, ఉత్సవాలు నిర్వహించే ప్రదేశాల్లో సీవరేజ్ సమస్యలు తలెత్తకుండా మ్యాన్‌హోళ్లు, పైప్లైన్లను ముందుగానే తనిఖీ చేయాలని ఆదేశించారు. ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించేలా సిబ్బంది, యంత్రాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్లు
నిర్మాణ పనులు, పార్కులు, ల్యాండ్‌స్కేపింగ్ వంటి తాగునీరు అవసరం లేని పనులకు శుద్ధి చేసిన మురుగునీటిని వినియోగించేలా గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం ట్యాంకర్ల రిజిస్ట్రేషన్, ఏకరీతి బ్రాండింగ్, ఫిల్లింగ్ స్టేషన్ల అభివృద్ధిపై దృష్టి సారించాలని ఎండీ సూచించారు. వినియోగదారులు సొంతంగా ట్యాంకర్లను ఏర్పాటు చేసుకుని నీటిని పొందడంతో పాటు, జలమండలి వద్ద నమోదైన ట్యాంకర్లను ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించనున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఏర్పాట్లను పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించాలని ఐటీ విభాగానికి సూచించారు.
ఎస్టీపీల నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి
నగరంలోని మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీలు) పనితీరును అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అశోక్ రెడ్డి ఆదేశించారు. నీటి నాణ్యత పరీక్షలు, ప్రయోగశాలల పనితీరు, రికార్డులను తనిఖీ చేసి, ప్రమాణాలు అందుకోని కేంద్రాల్లో సాంకేతిక లోపాలను సరిచేయాలన్నారు. అవసరమైన చోట అదనపు ఫిల్టర్లు, తదుపరి శుద్ధి ప్రక్రియలను ఏర్పాటు చేసి నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు.
మరో 500 ట్యాంకర్ల నమోదుకు చర్యలు
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సుమారు 1,200 ట్యాంకర్లకు అదనంగా మరో 500 ట్యాంకర్లను నమోదు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఎండీ ఆదేశించారు. బోడుప్పల్ ప్రాంతంలో పెండింగ్ బుకింగ్‌లను తగ్గించేందుకు అదనంగా 50 ట్యాంకర్లను నమోదు చేయాలని సూచించారు. రానున్న వేసవిలో నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఘట్కేసర్, కీసర తదితర ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ నీటి వనరులను గుర్తించాలని చెప్పారు.
విద్యుత్ అంతరాయాలు, లీకేజీల నివారణ
పంపింగ్ స్టేషన్లలో విద్యుత్ అంతరాయాలు, వోల్టేజీ హెచ్చుతగ్గులు, ప్రధాన పైప్‌లైన్ లీకేజీలు ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర మరమ్మతులను రాబోయే 15 రోజుల నుంచి నెల రోజుల్లో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రతి అధికారి రోజూ కనీసం పది నిమిషాలు సిబ్బందితో సమీక్ష నిర్వహించి, పెండింగ్ ఫిర్యాదులు, మరమ్మతుల పురోగతిని పర్యవేక్షించాలన్నారు.
ప్రస్తుత నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవడం, శుద్ధి చేసిన నీటి పునర్వినియోగాన్ని పెంచడం, నీటి వృథాను అరికట్టడం ద్వారా రానున్న వేసవిలోనూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటమే లక్ష్యమని ఎండీ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..






