India kabaddi Asian Games 2026: జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు (Asian Games 2026) కబడ్డీ టోర్నమెంట్‌లో భారత పురుషుల జట్టు కిరాక్ ప్రదర్శనతో చెలరేగింది. టోకై సిటిజన్స్ జిమ్నాసియంలో జరిగిన ఉత్కంఠభరితమైన సెమీఫైనల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 66–28 తేడాతో థాయిలాండ్‌ను చిత్తు చేసి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.
ఆరంభం నుంచే ఆధిపత్యం:
గ్రూప్-ఏ లో అన్ని మ్యాచ్‌లు గెలిచి అగ్రస్థానంతో సెమీస్‌లోకి అడుగుపెట్టిన భారత జట్టు, నాకౌట్ దశలో ఎలాంటి తడబాటు లేకుండా ఆడింది. ఇండియన్ డిఫెన్స్ విభాగంలో జైదీప్ దహియా, సుమిత్, రాహుల్ సేథ్‌పాల్, కెప్టెన్ సునీల్ కుమార్ అద్భుతంగా ఆడాడు. ఎనిమిది సార్లు ఆసియా క్రీడల కబడ్డీ చాంపియన్‌గా నిలిచిన భారత్, మ్యాచ్ ప్రారంభమైన మొదటి 5 నిమిషాల వ్యవధిలోనే థాయిలాండ్‌ను తొలిసారి ఆల్ఔట్ చేసి పూర్తి ఆధిక్యాన్ని సంపాదించింది.
థాయిలాండ్ ప్రతిఘటన - భారత రెయిడర్ల జోరు:
మొదటి ఎదురుదెబ్బ నుంచి థాయిలాండ్ జట్టు మెల్లగా కోలుకుంది. థాయిలాండ్ ప్లేయర్ థీరడెట్ చైసిత్ కొన్ని సంచనాత్మక సూపర్ రెయిడ్స్‌తో పాటు వరుస సక్సెస్‌ఫుల్ రెయిడ్స్‌తో విరుచుకుపడ్డాడు. ఆశ్చర్యకరంగా భారత్‌ను ఆల్- ఔట్ చేసి స్కోరును 24–14 కు తగ్గించాడు. కానీ, భారత రెయిడర్ దేవంక్ దలాల్ అద్భుతమైన ప్రదర్శనతో విజృంభించారు. మొదటి హాఫ్ ముగిసేసరికి భారత్ 37–18 ఆధిక్యంలో నిలిచింది.
సెకండ్ హాఫ్ లోనూ తగ్గని జోరు:
రెండో అర్ధభాగంలోనూ మ్యాచ్‌పై భారత జట్టు పూర్తి నియంత్రణ సాధించింది. థాయిలాండ్ తరఫున చైసిత్ ఒంటరి పోరాటం చేసినప్పటికీ, టీమిండియా వ్యూహాత్మకంగా ఆడుతూ మరో రెండుసార్లు థాయిలాండ్‌ను ఆల్- ఔట్ చేసింది. చివరికి 66–28 భారీ స్కోరుతో ఘన విజయం సాధించి ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.
ALSO READ : కోహ్లీ, రోహిత్ సీక్రెట్ డిస్కషన్..
స్వర్ణ పతక పోరుకు సర్వం సిద్ధం:
రేపు (సెప్టెంబర్ 26, శనివారం) జరిగే ఏషియన్ గేమ్స్ 2026 కబడ్డీ స్వర్ణ పతక పోరులో భారత్.. ఇరాన్, చైనీస్ తైపీ జట్ల మధ్య జరిగే మరో సెమీఫైనల్ విజేతతో తలపడనుంది. ఆసియా క్రీడల కబడ్డీ చరిత్రలో 1–0 తో ఎడిషన్లలో ఇండియా ఫైనల్ చేరడం ఇది తొమ్మిదోసారి కావడం విశేషం. కాగా, 2018 జకార్తా గేమ్స్‌లో కాంస్యంతో సరిపెట్టుకోవడం మినహా ప్రతీసారి భారత్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ టోర్నమెంట్‌లో కాంస్య పతక పోరు ఉండదని, సెమీఫైనల్స్‌లో ఓడిన రెండు జట్లు పోడియం స్థానాలను దక్కించుకుంటాయని నిర్వాహకులు తెలిపారు.


