
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందరికంటే ముందే అభ్యర్థుల ప్రకటనలో దూకుడు ప్రదర్శించింది. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంకా అభ్యర్థుల గురించి కసరత్తు పూర్తి చేయకముందే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థానిక సమరంలో తమ పార్టీ తరఫున తొలి అభ్యర్థిని అధికారికంగా ప్రకటించి కూటమి పార్టీలకు గట్టి సవాల్ విసిరారు.
అత్యంత ప్రతిష్టాత్మకమైన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా ఆనం విజయకుమార్ రెడ్డి పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. నెల్లూరు రాజకీయాల్లో ఆనం కుటుంబానికి ఉన్న సుదీర్ఘ అనుభవం, క్షేత్రస్థాయిలో ఉన్న బలమైన క్యాడర్ బలాన్ని నమ్ముకునే జగన్ ఈ ముందస్తు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం లాంటి మెట్రోపాలిటన్ కార్పొరేషన్లపై కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది.
బెజవాడ, వైజాగ్ మేయర్ పీఠాలను దక్కించుకోవడమే లక్ష్యంగా వైసీపీ అంతర్గత వ్యూహాలను పదును పెడుతోంది. ఆయా నగరాల్లో బలమైన సామాజిక సమీకరణాలు, ముఖ్యంగా వెనుకబడిన తరగతుల ఓటర్ల మద్దతు ఉన్న అభ్యర్థులను రంగంలోకి దించి కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. నెల్లూరులో ఆనం విజయకుమార్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ముందే ప్రకటించడం ద్వారా కేడర్‌లో సరికొత్త జోష్ నింపిన వైసీపీ.. రాబోయే రోజుల్లో మిగిలిన ప్రధాన కార్పొరేషన్లకు కూడా గెలుపు గుర్రాలనే ఎంపిక చేసి స్థానిక పోరులో ముందంజ వేయాలని చూస్తోంది.
The post స్థానిక పోరులో తొలి అభ్యర్థిని ప్రకటించిన జగన్..! appeared first on Telugu Rajyam.





