Kolkata Stampede : పశ్చిమబెంగాల్ (West Bengal) రాజధాని కోల్కతా (Kolkata) లోని చోర్బగాన్ సర్బజనీన్ (Chorbagan Sarbojanin) దుర్గా మండపం (Durga Pandal) వద్ద గత రాత్రి జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మొత్తం 19 మంది మృతిచెందారు. వారిలో 13 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. మరో 35 మంది గాయపడ్డారు. గాయపడిన వారంతా ప్రస్తుతం వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై పశ్చిమబెంగాల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉమేష్ రాయ్ స్పందించారు. చోర్బగాన్ సర్బజనీన్ దుర్గా మండపానికి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడం సాధారమేనని చెప్పారు. ఎప్పటిలాగే శనివారం కూడా దుర్గామాత దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని, అయితే అదే సమయంలో వర్షం కూడా పడటం తొక్కిసలాటకు దారితీసిందని చెప్పారు.
ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో మండపం బయట ఉన్న భక్తులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిచారని, అయితే లోపల కూడా అప్పటికే భక్తులు కిక్కిరిసిపోవడంతో తొక్కిసలాట జరిగిందని ఉమేష్ రాయ్ చెప్పారు. అయితే ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసిందని తెలిపారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.
తొక్కిలాటలో మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయనున్నట్లు ఉమేష్ రాయ్ తెలిపారు. అదేవిధంగా కుటుంబంలో అర్హులైన వారు ఉంటే గ్రూప్-డి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు చెప్పారు. గాయపడిన వారికి రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేస్తామన్నారు. అదేవిధంగా వారి వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.






