Kolkata stampede : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఘోరం జరిగింది. ఒక దుర్గా పూజా మండపంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 19 మంది మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర కోల్కతా, చోరెబగన్ ప్రాంతంలో శనివారం రాత్రి జరిగింది. మృతుల్లో మహిళలు ఉన్నారు.
ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని సీఎం సువేందు అధికారి వెల్లడించారు. తొక్కిసలాట ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి, సహాయక చర్యలు చేపట్టిందన్నారు. బాధితులను వెంటనే కోల్కతా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు తరలించి, చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన శనివారం రాత్రి 7.40 గంటల సమయంలో జరిగింది. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఇదే సమయంలో రాత్రి భారీ వర్షం పడటం, ఒకరికి ఒకరు తోసుకోవడం, బయటకు వెళ్లే మార్గం విషయంలో గందరగోళం కారణంగా బాధితులు క్యూలైన్లలోనే చిక్కుకుపోయారు.
ఘటన జరిగిన సమయంలో ఈ ప్రదేశం మొత్తం చీకటిగా ఉంది. దీంతో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. నిర్వహణా వ్యవస్థ, భద్రతా ఏర్పాట్లు కూడా సరిగ్గా లేవని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గందరగోళం కారణంగా భక్తులంతా ఒకేసారి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లు ప్రాథమిక అంచనా. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. ఇదే సమయంలో నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశారు.






