Google Photos: ఫొటోలను ఎడిట్ చేయడం, ఆర్గనైజ్ చేసుకోవడాన్ని మరింత సులభతరం చేసేందుకు Google Photosలో కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. రెడాక్ట్ పెన్, మూడ్స్, కొత్త రీమిక్స్ టెంప్లేట్లు, AI వార్డ్‌రోబ్ వంటి ఫీచర్లను గూగుల్ తీసుకొస్తోంది. అంతేకాదు.. Gemini Sparkను కూడా Google Photosతో అనుసంధానిస్తోంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్లు ప్రాంతాలను బట్టి దశలవారీగా అందుబాటులోకి వస్తున్నాయి.
Read Also :Bilibili India: యూట్యూబ్కు పోటీగా బిలిబిలి.. భారత్‌లోకి ఎంట్రీకి రెడీ?
సున్నితమైన సమాచారాన్ని బ్లర్ చేయొచ్చు

Google Photosలోని మార్కప్ టూల్‌కు గూగుల్ కొత్త అప్‌డేట్ ఇచ్చింది. ఇందులో భాగంగా Redact Penను తీసుకొచ్చింది. దీని ద్వారా ఫొటోల్లో కనిపించే ఫోన్ నంబర్లు, చిరునామాలు లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని బ్లర్ చేసుకోవచ్చు. రెడాక్ట్ పెన్ మందాన్ని కూడా అవసరానికి అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఫొటోలపై టెక్స్ట్ రాసేందుకు మరిన్ని కొత్త ఫాంట్లను కూడా గూగుల్ జోడించింది.
పాతకాలం లుక్ కోసం ‘మూడ్స్’
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం Moods ఫీచర్‌ను గూగుల్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తోంది. దీని ద్వారా సాధారణ ఫొటోలకు పాతకాలం నాటి ఫిల్మ్ కెమెరా లేదా డిజిటల్ కెమెరా తరహా లుక్ ఇవ్వవచ్చు. 35mm ఫిల్మ్, 2000ల డిజిక్యామ్ వంటి స్టైల్స్‌ను ఫొటోలకు అప్లై చేసుకోవచ్చు. ఎఫెక్ట్ తీవ్రతను స్లైడర్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన విధంగా సర్దుబాటు చేసుకోవచ్చు.
కొత్త రీమిక్స్ టెంప్లేట్లు
ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం ఎంపిక చేసిన దేశాల్లో 15 కొత్త Remix టెంప్లేట్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. వీటితో రెడ్ కార్పెట్ తరహా ఫొటోలు, బర్త్‌డే కార్డులు, ఫొటోబూత్ షాట్లు వంటి క్రియేటివ్ కంటెంట్‌ను రూపొందించుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ 18 ఏళ్లు పైబడిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని గూగుల్ తెలిపింది.
AIతో డిజిటల్ వార్డ్‌రోబ్
Google Photosలోకి వస్తున్న మరో ఆసక్తికరమైన ఫీచర్ AI Wardrobe. అమెరికా, భారత్, బ్రెజిల్‌లో అర్హత ఉన్న ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్‌ను గూగుల్ విస్తరించింది. ఫొటోల్లో కనిపించే దుస్తులను ఒక డిజిటల్ కలెక్షన్‌గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. వాటి ఆధారంగా కొత్త దుస్తుల కాంబినేషన్లను చూడటంతో పాటు వర్చువల్ స్టైలింగ్‌ను కూడా ప్రయత్నించవచ్చు. ఈ వార్డ్‌రోబ్ డేటాను రిటైలర్లు వంటి థర్డ్ పార్టీ సంస్థలతో పంచుకోబోమని గూగుల్ పేర్కొంది.
Google Photos: ఒక్క ప్రాంప్ట్‌తో ఫొటోలు ఎంపిక, ఎడిటింగ్
Gemini Sparkను Google Photosతో అనుసంధానించడం ద్వారా ఫొటోలను ఎడిట్ చేయడం మరింత సులభం కానుంది. ఉదాహరణకు కుటుంబ ఫొటోల్లో బెస్ట్ చిత్రాలను గుర్తించి, వాటి బ్రైట్‌నెస్ పెంచి, షేర్ చేసేందుకు సిద్ధం చేయమని ఒకే ప్రాంప్ట్‌తో సూచించవచ్చు. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం అమెరికాలోని అర్హత ఉన్న Google AI Pro, Ultra సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. Redact Pen, Moods, Remix Templates, AI Wardrobe వంటి ఫీచర్లతో Google Photosలో ఫొటో ఎడిటింగ్, ఆర్గనైజేషన్‌కు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఫీచర్ల లభ్యత దేశం, డివైజ్, యూజర్ అర్హతలను బట్టి మారవచ్చు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :






