☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

9 రోజులు నిలుచునే పూజలు.. అలానే నిద్రాహారాలు.. 350 ఏళ్లుగా కొనసాగుతున్న అరుదైన ఆచారం..

మహారాష్ట్రలోని సతారా జిల్లా పాండే గ్రామంలో సుమారు 350 ఏళ్లుగా అరుదైన నవరాత్రి సంప్రదాయం కొనసాగుతోంది. ఇక్కడ కాల భైరవనాథుడిపై భక్తితో వందలాది మంది తొమ్మిది రోజుల పాటు కూర్చోకుండా, నేలపై పడుకోకుండా నిలబడే దీక్ష చేపడతారు. ‘ఉభ్యాచీ నవరాత్రి’గా పిలిచే ఈ ఆచారంలో ప్రత్యేక ఆహార నియమాలు పాటిస్తూ ఆలయంలోనే ఎక్కువ సమయం గడుపుతారు. మరో విశేషమేమిటంటే, హిందువులతో పాటు ముస్లింలు కూడా ఈ సంప్రదాయంలో పాల్గొంటూ మతసామరస్యానికి ఉదాహరణగా నిలుస్తున్నారు.
9 రోజులు నిలుచునే పూజలు.. అలానే నిద్రాహారాలు.. 350 ఏళ్లుగా కొనసాగుతున్న అరుదైన ఆచారం..

నవరాత్రులు అనగానే తొమ్మిది రోజుల పాటు అమ్మవారి పూజలు, ఉపవాసాలు, దీక్షలు గుర్తుకొస్తాయి. కానీ మహారాష్ట్రలోని ఓ గ్రామంలో మాత్రం నవరాత్రి దీక్ష అంటే కూర్చోకుండా తొమ్మిది రోజులూ నిలబడటమే. నిద్రపోవాలన్నా, విశ్రాంతి తీసుకోవాలన్నా పూర్తి‌ శరీరాన్ని నేలను తాకకుండా జాగ్రత్త పడాల్సిందే. దాదాపు 350 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ అరుదైన ఆచారం భక్తి, విశ్వాసం, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. మహారాష్ట్రలోని సతారా జిల్లా, వాయి తాలూకా పరిధిలో ఉన్న పాండే గ్రామంలో కాల భైరవ నాథ్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రతి ఏడాది శారదీయ నవరాత్రుల సందర్భంగా ‘ఉభ్యాచీ నవరాత్రి’ పూజలు కొనసాగుతాయి. ఉభ్యాచీ నవరాత్రి అంటే ‘నిలబడి జరుపుకునే నవరాత్రి’ వేడుకలు అని‌ అర్థం. ఈ సంప్రదాయం సుమారు 350 ఏళ్లుగా కొనసాగుతున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

సాధారణంగా నవరాత్రుల్లో భక్తులు ఉపవాసాలు ఉండటం, పూజలు చేయడం, అమ్మవారిని ఆరాధించడం చూస్తుంటాం. కానీ పాండే గ్రామంలో మాత్రం కాల భైరవనాథుడిపై భక్తితో వందలాది మంది పురుషులు తొమ్మిది రోజుల పాటు కూర్చోకుండా, నేలపై పడుకోకుండా దీక్ష చేపట్టడం తరతరాల ఆచారంగా కొనసాగుతుంది. ఘట స్థాపన నుంచి విజయదశమి వరకు ఈ నియమాన్ని పాటిస్తారు అక్కడి భక్తులు.

కోరిక తీరితే.. కృతజ్ఞతగా మరో దీక్ష..

ఈ దీక్షను స్థానికంగా ‘నవాస్‌’ అని పిలుస్తారు. తమ కోరికలు నెరవేరాలని కొందరు, గతంలో కోరుకున్న కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా మరికొందరు ఈ మొక్కు చెల్లించుకుంటారు. పాల్గొనే కుటుంబాల్లో సాధారణంగా కనీసం ఒకరైనా ఈ దీక్షలో భాగమవుతారు. ఒకసారి దీక్ష తీసుకుంటే తొమ్మిది రోజుల పాటు కఠినమైన నియమాలు పాటించాల్సిందే. అంతేకాదు.. కొందరు భక్తులు మూడు, ఐదు, ఏడు, పది లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని మొక్కుకుంటారు. వయసుతో సంబంధం లేకుండా సుమారు 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉన్నవారు ఇందులో పాల్గొంటారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న గ్రామస్థులు సైతం నవరాత్రుల సమయంలో స్వగ్రామానికి చేరుకుంటారు. సైన్యంలో పనిచేసేవారు కూడా సెలవులు తీసుకుని మరీ ఈ దీక్షలో పాల్గొంటుండటం ఈ సంప్రదాయంపై వారికున్న విశ్వాసాన్ని తెలియజేస్తోంది.

Unique Navratri Tradition

Unique Navratri Tradition

విశ్రాంతి తీసుకున్నా.. నేలపై కూర్చోకూడదు!

ఈ దీక్షలో అత్యంత కఠినమైన నియమం నేలపై కూర్చోకపోవడం, పడుకోకపోవడం. మరి తొమ్మిది రోజుల పాటు అలసటను ఎలా అధిగమిస్తారు? ఇందుకోసం ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయల వంటి వస్త్రాలను ఉపయోగిస్తారు. వీటిని స్థానికంగా ‘చౌఫాలా’ అని పిలుస్తారు. భక్తులు తమ ఛాతీని ఆ వస్త్రానికి ఆనించి శరీరానికి విశ్రాంతి కల్పిస్తారు. అయితే ఒక కాలు మాత్రం నేలపై తప్పనిసరిగా ఉంచాలి. నేలతో పాదాల సంబంధం తెగకూడదన్నది ఈ ఆచారం వెనుక ఉన్న విశ్వాసమని ఆలయ కమిటీ చైర్మన్ హేమంత్ జాదవ్ చెబుతున్నారు. ఈ కారణంగానే వేగంగా నడవడం, పరుగెత్తడం, గెంతడం వంటి పనులకు అనుమతి ఉండదు. దీక్షలో ఉన్నవారు తెల్లటి దుస్తులు ధరించి, చెప్పులు లేకుండా ఉంటారు. శరీర సమతుల్యత కోసం చేతిలో కర్రను కూడా పట్టుకుంటారు.

ఆహార నియమాలూ కఠినమే!

నిలబడటంతో పాటు ఆహార నియమాలను కూడా భక్తులు కచ్చితంగా పాటిస్తారు. నూనె, ఉప్పు, కారం వంటి వాటికి దూరంగా ఉంటారు. పాలు, పండ్లు, సగ్గుబియ్యంతో తయారు చేసిన పాయసం వంటి ఆహారాన్ని తీసుకుంటారు. ఉదయం, సాయంత్రం పూజల్లో పాల్గొంటారు. దీక్షలో ఏదైనా నియమాన్ని పొరపాటున ఉల్లంఘించినా ఆలయ పూజారికి తెలియజేసి, తిరిగి ఆచారాన్ని ప్రారంభించాల్సి ఉంటుందని గ్రామస్థులు చెబుతున్నారు. తప్పును దాచిపెట్టడం వల్ల కాళ్ల నొప్పులు, అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయని కొందరు నమ్ముతున్నప్పటికీ.. ఇవి వారి వ్యక్తిగత విశ్వాసాలేనని గుర్తించాలి.

ఆలయంలోనే ఎక్కువ సమయం!

ఈ తొమ్మిది రోజులూ భక్తుల దినచర్య ప్రత్యేకంగా ఉంటుంది. రాత్రిపూట ఆలయ ప్రాంగణంలోనే గడుపుతారు. తెల్లవారుజామున సుమారు 4.30 గంటలకు ఇంటికి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం ఉదయం హారతికి హాజరవుతారు. అల్పాహారం చేసిన తర్వాత తిరిగి ఆలయానికి చేరుకుంటారు. పగటిపూట ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, ధ్యానం చేయడం, తోటి భక్తులతో మాట్లాడటం వంటి పనులతో కాలం గడుపుతారు. యువకుల్లో కొందరు మొబైల్ ఫోన్లు కూడా ఉపయోగిస్తారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత గ్రామంలో తిరిగి, అనంతరం ఆలయానికి చేరుకుని సాయంత్రం హారతిలో పాల్గొంటారు. భోజనం, వ్యక్తిగత అవసరాల కోసం ఇంటికి వెళ్లడం మినహా ఎక్కువ సమయం ఆలయంలోనే గడుపుతారు. విజయదశమి వరకు గ్రామ సరిహద్దులు దాటి వెళ్లకూడదన్న నియమాన్ని కూడా పాటిస్తారు.

మతాలకతీతంగా భక్తి.. ఐక్యతకు నిదర్శనం!

పాండే గ్రామంలోని ఉభ్యనవరాత్రి మరో ప్రత్యేకతతోనూ గుర్తింపు పొందుతోంది. ఈ దీక్షలో హిందువులతో పాటు ముస్లింలు కూడా పాల్గొంటారు. గ్రామానికి చెందిన హారూన్ ఇనాందార్ గత 26 ఏళ్లుగా ఈ సంప్రదాయంలో భాగమవుతున్నారు. తమ గ్రామంలో మతపరమైన వివక్ష లేదని, తోటి గ్రామస్థులతో కలిసి ఈ తొమ్మిది రోజులూ గడపడం ఆనందంగా ఉంటుందని ఆయన చెబుతున్నారు. ఎలాంటి ప్రత్యేక ప్రతిఫలాన్ని ఆశించకుండా అన్ని నియమాలనూ పాటిస్తానని వివరిస్తున్నారు. మతాలు వేరైనా గ్రామ సంప్రదాయం విషయంలో అందరూ కలిసి ముందుకు సాగడం.. ఈ ఆచారాన్ని కేవలం ఒక మతపరమైన కార్యక్రమంగానే కాకుండా సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుపుతోంది. భక్తి మనుషులను కలపాలి.. సంప్రదాయం సమాజాన్ని ముందుకు నడపాలి.. సమానత్వం ప్రతి ఒక్కరికీ గౌరవాన్ని అందించాలి. పాండే గ్రామ ఉభ్య నవరాత్రి అందిస్తున్న సందేశం ఇదే..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Jailer 2: బాక్సాఫీస్ వద్ద రజినీ సంచలనం.. వసూళ్లతో థియేటర్లను షేక్ చేస్తున్న జైలర్ 2.. మూడు రోజుల్లో ఎంతంటే..షాద్‌నగర్ రాయికల్ టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com