Russia Earthquake: రష్యాలోని ఓజెర్నోవ్స్కీ సమీపంలో గల కమ్చట్కా ద్వీపకల్పంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:36 గంటల ప్రాంతంలో సుమారు ఒక నిమిషం పాటు భూమి తీవ్రంగా కంపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంప ప్రకంపనల తీవ్రతకు ఇళ్లలోని దీపాలు ఊగడం, తలుపులు గట్టిగా మూసుకుపోవడం, గృహోపకరణాలు కదలడంతో జనాలు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో ఉండటం వల్ల కమ్చట్కాలో తరచుగా ఇటువంటి భూకంపాలు సంభవిస్తుంటాయి.
సునామీ ముప్పు లేదు.. ఉపరితలానికి లోతుగా నమోదు:
ఈ భూకంప తీవ్రత రిక్టర్ (Russia Earthquake)స్కేలుపై 6.9గా నమోదైనప్పటికీ, ఎలాంటి సునామీ ప్రమాదం లేదని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, జియోఫిజికల్ సర్వీస్ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. భూకంప కేంద్రం భూ ఉపరితలం కింద అత్యంత లోతులో ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని వారు వెల్లడించారు. గతంలో జూలై 2025లో కూడా ఈ ప్రాంతంలో 8.8 తీవ్రతతో వినాశకర భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఘటనలో ప్రజలు ఊపిరి పీల్చుకున్నప్పటికీ వాతావరణం ఇంకా ఉద్రిక్తంగానే ఉంది.






