IPL 2027: ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ విస్తరిస్తున్న టీ20 లీగ్‌ల హవా జాతీయ జట్లకు తీవ్ర సవాలుగా మారింది. రాబోయే బిజీ అంతర్జాతీయ షెడ్యూల్ దృష్ట్యా క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) తమ ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 2027 (IPL 2027) సీజన్లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు పాల్గొనడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
2027 మార్చి 11 నుంచి ఇంగ్లాండ్‌తో జరిగే చారిత్రాత్మక 150వ వార్షికోత్సవ టెస్ట్ మ్యాచ్ (150th Anniversary Test) తో పాటు రాబోయే యాషెస్ సిరీస్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ లాంటి వరుస రెడ్ బాల్ మ్యాచ్‌ల క్యాలెండర్ ఐపీఎల్ షెడ్యూల్‌తో ఘర్షణ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఐపీఎల్ 2027 ఆడటంపై క్లారిటీ లేదన్నాడు.
ఐపీఎల్ 2027 ఆడటంపై ఇంకా నిర్ణయం తీసుకోలే: మిచెల్ స్టార్క్
* ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రూ. 11.75 కోట్లకు దక్కించుకున్న మిచెల్ స్టార్క్, గాయాల కారణంగా 2026 సీజన్లో కేవలం 6 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. రాబోయే సీజన్ అందుబాటుపై స్టార్క్ స్పందిస్తూ.. నా షెడ్యూల్‌పై మేనేజ్మెంట్తో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నాడు.
ఆసీస్ హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కీలక వ్యాఖ్యలు:
ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ (Andrew McDonald) మాట్లాడుతూ.. ఫ్రాంచైజీ లీగ్‌లు, జాతీయ జట్టు మధ్య సమతుల్యత సాధించడంపై కీలక విషయాలు వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 లీగ్ అయిన ఐపీఎల్లో ఆడటం ద్వారా ఆటగాళ్ల నైపుణ్యాలు పెరుగుతాయని మేం నమ్ముతాం.. అది మా ప్లేయర్స్ మేనేజ్మెంట్ ప్లాన్‌లో ఒక భాగమే.. కానీ అదే సమయంలో ఫాస్ట్ బౌలర్ల శారీరక సామర్థ్యం (Physical Management) అత్యంత ముఖ్యం. బిజీ షెడ్యూల్, డబ్ల్యూటీసీ ఫైనల్, యాషెస్ లాంటి కీలక టోర్నీలను దృష్టిలో పెట్టుకుని బౌలర్లకు తగినంత రెస్ట్ ఇవ్వడం ప్రాథమిక బాధ్యత.. బౌలర్లు తమ శరీరానికి రీసెట్ బటన్ నొక్కి, త్వరలో జరగబోయే కీలక మ్యాచ్‌లకు సిద్ధంగా ఉండేలా చూడడమే మా లక్ష్యం అని మెక్‌డొనాల్డ్ స్పష్టం చేశారు.
ఆస్ట్రేలియా ఆటగాళ్ల నిర్ణయంపై నమ్మకం:
ఏది ఏమైనప్పటికీ ఆస్ట్రేలియా జాతీయ జట్టు తరఫున ఆడటానికే తమ ప్లేయర్లు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యం ఇస్తారని, ఈ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారనే నమ్మకం తనకు ఉందని కోచ్ మెక్‌డొనాల్డ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య బృందం, ఎంపిక కమిటీ తీసుకునే నిర్ణయాల ఆధారంగానే ఐపీఎల్ 2027లో మిచెల్ స్టార్క్, ఇతర ఆసీస్ ప్లేయర్ల భాగస్వామ్యం ఆధారపడి ఉండనుంది.


