Polavaram : ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం బహుళార్ధసాధక ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి తీవ్ర ముంపు ప్రమాదం పొంచి ఉందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్ కేంద్ర జలశక్తి శాఖకు సమగ్రమైన లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసినప్పుడు, గోదావరి వెనుక జలాలు (బ్యాక్ వాటర్) ఉప్పొంగి తెలంగాణలోని సరిహద్దు ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉందని అందులో స్పష్టం చేశారు. ముఖ్యంగా చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రమైన భద్రాచలంతో పాటు దాని పరిసర ప్రాంతాలు, గ్రామాలు నీటమునిగే తీవ్ర ముప్పు ఉందనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
Read Also : ఏపీలో భారీ వర్షాలు.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు

కరకట్టల నిర్మాణం & శాశ్వత పరిష్కారానికి విజ్ఞప్తి
ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రభుత్వం లేఖలో నొక్కిచెప్పింది. ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న సున్నితమైన ప్రాంతాల్లో వెంటనే బలమైన కరకట్టల నిర్మాణం చేపట్టడంతో పాటు, అత్యవసర సమయాల్లో నీటిని తోడేసేందుకు భారీ పంపింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరింది. సరిహద్దు రాష్ట్రాల మధ్య తలనెత్తిన ఈ సున్నితమైన జల వివాదంపై కేంద్ర జలశక్తి శాఖ తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. భద్రాచలం ప్రాంత ప్రజల భద్రతను, భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ బ్యాక్ వాటర్ సమస్యకు సాంకేతికంగా, శాశ్వతంగా ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని రాష్ట్రాన్ని కోరింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :






