హైదరాబాద్ నల్లకుంటలో వృద్ధురాలి నుంచి 42 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. 2026 సెప్టెంబర్ 25న స్వాధీనం చేసుకున్న ఆభరణాలతో పాటు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
న్యూ నల్లకుంటలోని స్వగృహ శ్రీనివాస్ అపార్ట్‌మెంట్‌లో జరిగిన చోరీ కేసులో కేర్ టేకరే నిందితురాలిగా గుర్తించారు. ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలి ఇంట్లో కేర్‌టేకర్‌గా పనిచేస్తున్న బుద్దుల ప్రవీణ చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వృద్ధురాలు బాత్రూమ్‌కు వెళ్లిన సమయంలో బంగారు పుస్తెల తాడు, రెండు సెల్‌ఫోన్లు, రూ.25 వేల నగదు, సుమారు 26 తులాల బంగారు ఆభరణాలు అపహరించినట్లు వెల్లడించారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితురాలిని గుర్తించి, ఎల్‌బీనగర్ బస్‌స్టాండ్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గర నుంచి 26 తులాల బంగారు ఆభరణాలు, రెండు చోరీ ఫోన్లతో పాటు మరో మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్ నంబర్ 288/2026, BNS 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.






