ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కూటమి ప్రభుత్వ పెద్దలు విచ్చలవిడిగా అరాచకాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేసే పరిస్థితులు లేవని ఆయన మండిపడ్డారు. పరిస్థితి చూస్తుంటే అసలు ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారని సంచలన ఆరోపణ చేశారు. పోలీసులే స్వయంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ పూర్తికాకముందే హడావుడిగా ఎన్నికలు పెట్టారని విమర్శించారు. 44 లక్షల అనుమానాస్పద ఓట్లు ఉన్నా కేవలం 12 రోజుల్లోనే ప్రక్రియ ముగించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.
పోలీసులను కూటమి ప్రభుత్వం కిరాయి సైన్యంలా మార్చిందని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెంట వచ్చిన అభ్యర్థులను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని చెప్పారు. పుంగనూరులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిపై దాడి చేశారని పేర్కొన్నారు. తిరుపతిలో ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం చేతుల్లోని నామినేషన్ పత్రాలను లాక్కుని చించేశారని తెలిపారు. రాయచోటి, గురజాల, రాజంపేటలలోనూ అరాచకాలు సృష్టించారని వివరించారు.
ఎన్నికల సంఘం పూర్తిగా డమ్మీగా మారిపోయిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అభ్యర్థులను నామినేషన్ వేయనివ్వకుండా అడ్డుకోవడం రాజకీయ పిరికితనమని విమర్శించారు. ఈ దాడులు, అక్రమాలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఆధారాలతో సహా ప్రజాక్షేత్రంలో కూటమి ప్రభుత్వ తీరును ఎండగడతామని సజ్జల హెచ్చరించారు.
The post చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసుల కాల్పులు: సజ్జల appeared first on Adya News Telugu.






