Flights Cancelled: ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న కుండపోత వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం రాష్ట్రంలోని విమాన రాకపోకలపై తీవ్రంగా పడింది. ఉమ్మడి విశాఖ, కృష్ణా, గోదావరి జిల్లాల్లో వర్షాలతో పాటు దట్టమైన మేఘాలు ఆవరించడంతో పలు విమానాలు ల్యాండ్ కాలేక ఇతర విమానాశ్రయాలకు దారి మళ్లగా, మరికొన్ని సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. విమానాల్లో అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో గంటల తరబడి నిరీక్షిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దారి మళ్లిన విమానాలు – నాగపూర్‌లో సురక్షితంగా ల్యాండ్ అయిన మంత్రులు:
వర్షాలు, సిగ్నల్ వ్యవస్థ లోపాల కారణంగా పలు కీలక విమాన సర్వీసులను దారి మళ్లించారు. విశాఖ నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని హైదరాబాద్ శంషాబాద్‌కి, రాజమండ్రి వెళ్లాల్సిన స్టార్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని(Flights Cancelled) బెంగళూరుకు మళ్లించారు. అంతేకాకుండా బుధవారం రాత్రి విజయవాడ నుంచి భోగాపురం బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ ప్రయాణించారు. భోగాపురంలో సిగ్నల్ సమస్యతో ల్యాండ్ కాలేకపోవడంతో ఆ విమానాన్ని నాగపూర్‌కు మళ్లించగా, రెండు గంటల ఉత్కంఠ తర్వాత అక్కడ సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
నిలిచిపోయిన విజయవాడ – విశాఖ సర్వీసులు, ప్రయాణికులకు హెచ్చరిక:
వాతావరణం అనుకూలించే వరకు విజయవాడ, విశాఖపట్నం మధ్య నడిచే అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికులు విమానాశ్రయాలకు బయలుదేరే ముందే సంబంధిత ఎయిర్‌లైన్ సంస్థల ద్వారా విమానాల స్టేటస్‌ను సరిచూసుకోవాలని సూచించారు. వాతావరణం సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రయాణికులు సహకరించాలని కోరారు.






