హైదరాబాద్: దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో తెలంగాణలోని ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పండుగలను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో సొంతూళ్లకు పయనమవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ ప్రాంతాల్లో రద్దీ నెలకొంది.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. కుటుంబాలతో కలిసి సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య పెరగడంతో ప్రజా రవాణాపై ఒత్తిడి అధికమైంది.దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులు విజయవంతంగా కొనసాగినట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి వెల్లడించారు. అక్టోబర్ 9 నుంచి 14వ తేదీ వరకు మొత్తం 2,474 ప్రత్యేక బస్సులను నడిపినట్లు తెలిపారు. ఈ కాలంలో 94.07 శాతం ఆపరేషన్ నమోదైనట్లు పేర్కొన్నారు.
జిల్లాల వారీగా చూస్తే ఖమ్మంలో అత్యధికంగా 133.33 శాతం ఆపరేషన్ నమోదైంది. మెదక్లో 123.15 శాతం, ఆదిలాబాద్లో 116.90 శాతం ఆపరేషన్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పండుగల సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో ప్రతిరోజూ పరిస్థితిని సమీక్షించాలని ఎండీ వై. నాగిరెడ్డి అధికారులను ఆదేశించారు. బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన ప్రాంతాల్లో అదనపు బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
16, 17 తేదీల్లోనూ రద్దీ పెరిగే అవకాశం
దసరా సెలవులు ముగియనుండటంతో తిరుగు ప్రయాణాల సమయంలోనూ ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉందని టీజీఎస్ఆర్టీసీ అంచనా వేస్తోంది. ముఖ్యంగా అక్టోబర్ 16, 17 తేదీల్లో ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలను గుర్తించి, అవసరమైన చోట్ల అదనపు బస్సులు నడపాలని ఎండీ అధికారులను ఆదేశించారు.పండుగల సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో పాటు సెలవుల అనంతరం హైదరాబాద్కు తిరిగి వచ్చే వారికి కూడా ఇబ్బందులు కలగకుండా రవాణా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచి, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.


