- గరుడసేవకు భారీగా తరలిరానున్న భక్తజనం
- భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
- మాడవీధుల్లో గ్యాలరీలు, క్యూలైన్ల నిర్వహణపై దృష్టి
- భద్రత, తాగునీరు, అన్నప్రసాదం, వైద్యసేవలకు ప్రాధాన్యం
- పోలీసుల నిఘాలో తిరుమల గరుడసేవ ఏర్పాట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడ వాహనసేవకు తిరుమల సిద్ధమయింది.. గరుడసేవ సందర్భంగా లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి సారించారు.
శ్రీవారి గరుడసేవను దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.. తిరుమల నాలుగు మాడవీధుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, గ్యాలరీలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాల నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చారు...
ముఖ్యంగా గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు పోలీసు శాఖతో సమన్వయంతో భద్రతా చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేసారు.. సీసీ కెమెరాల నిఘా, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు ప్రత్యేక బృందాలను సిద్దంగా ఉంచే అంశాలపై అధికారులు దృష్టి సారించారు..
భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం, మజ్జిగ పంపిణీ, పారిశుద్ధ్య నిర్వహణ, అత్యవసర వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు..
తిరుమలకు వచ్చే వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఘాట్ రోడ్లపై ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, తిరుపతి నుంచి తిరుమలకు రవాణా ఏర్పాట్లు కీలకం. భక్తులు అధికారుల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా స్వామివారి గరుడసేవను దర్శించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడసేవను భక్తులకు సంతృప్తికరంగా నిర్వహించడమే లక్ష్యంగా టీటీడీ, పోలీసు, విజిలెన్స్, ఇతర విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి..
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, టీటీడీ సీవీఎస్వో కేవీ మురళీకృష్ణ నాలుగు మాడవీధులు, భక్తుల గ్యాలరీలు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.గరుడసేవ నేపథ్యంలో ఘాట్ రోడ్డుపై ద్విచక్ర వాహనాలకు తాత్కాలిక ఆంక్షలు అమల్లో ఉన్నాయి. తిరుపతిలో ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు, ఆర్టీసీ బస్సుల ద్వారా భక్తుల రవాణాకు ఏర్పాట్లు చేసారు


