Tiger Shroff : బాలీవుడ్ నటుడు (Bollywood Actor) టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) పై కాల్పుల ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు తాజాగా మరో సంచలన విషయాన్ని వెల్లడించారు. షూటర్ల అసలు టార్గెట్ టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) కాదని, మరో అగ్ర హీరోపై దాడి చేయాలని భావించి వీలుకాకపోవడంతో టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు.
ఈ కేసులో ఆయుధాలు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు మహిళలు సహా మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తొలుత ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుంది. అయితే ఆయన ఇంటి వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చూసి.. ప్లాన్ మార్చుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాతనే టైగర్ ష్రాఫ్‌ను టార్గెట్ చేసుకున్నట్లు సమాచారం. ముంబైలోని బాంద్రాలో సల్మాన్ ఖాన్ నివాసం వద్ద నిందితులు ముందుగా రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తున్నది.
అక్కడ భద్రత ఎక్కువగా ఉండటంతో దాడి సాధ్యం కాదని భావించి టైగర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాలు బయటకు వచ్చిన అనంతరం ముంబైలో ఉన్న సల్మాన్ ఇంటి వద్ద రక్షణ వలయాన్ని మరింత కట్టుదిట్టం చేశారు. భవనం లోపల, బయట, రహదారికి ఇరువైపులా పోలీసు సిబ్బంది పహారా కాస్తున్నారు. సల్మాన్‌ని టార్గెట్ చేయలేం అని గ్రహించిన నిందితులు టైగర్ ష్రాఫ్‌కు పోలీసు భద్రత లేదని సోషల్ మీడియా రీల్స్‌లో తెలుసుకున్నట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి.
అదేవిధంగా ఆయన ప్రతి ఆదివారం జుహు ప్రాంతంలోని ఫుట్‌బాల్ మైదానానికి వస్తుంటారని తెలుసుకుని, రెక్కీ వేసి కారుపై కాల్పులు జరిపినట్లు తెలుస్తున్నది. సల్మాన్‌ఖాన్‌తో కలిసి పనిచేసే వారినీ లక్ష్యంగా చేసుకుంటామని బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఈ కాల్పుల ఘటనలో ఆయుధాలు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని ఢిల్లీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. హర్యానాకు చెందిన కునాల్, సుమిత్‌తోపాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాధ, బబితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కునాల్ మొదట అమృత్‌సర్ నుంచి పిస్టల్, బుల్లెట్స్ సేకరించాడని, ఆ తర్వాత రాధ సాయంతో వాటిని ముంబైకి చేర్చాడని పోలీసులు తెలిపారు. అక్కడ ఓ మైనర్ బాలుడికి ఆ బ్యాగ్‌ను అప్పగించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న అనిల్ పండిత్ ఆదేశాల మేరకే ఈ వ్యవహారం నడిచిందా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.






