దక్షిణ కొరియాలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. హాఫ్ మారథాన్‌లో పాల్గొన్న 25 ఏళ్ల రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్ యూ జి-వోన్ పరుగు పూర్తి చేయడానికి కాస్త దూరం ఉండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆమెకు అత్యవసర చికిత్స అందించి ఆసుపత్రికి తరలించిన ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ ఘటనతో రన్నింగ్ కమ్యూనిటీలో విషాదం నెలకొంది.
ముగింపు రేఖకు చేరువలో
2026 అక్టోబర్ 11న జరిగిన సియోల్ రేస్‌లో యూ జి-వోన్ హాఫ్ మారథాన్‌లో పాల్గొన్నారు. మొత్తం 21 కిలోమీటర్ల దూరం పరుగెత్తాల్సిన ఈ పోటీలో ఆమె 20.6 కిలోమీటర్లు పూర్తి చేశారు. మరో 500 మీటర్లు పరుగెత్తితే గమ్యస్థానానికి చేరుకునేవారు. అయితే, ఉదయం సుమారు 8.49 గంటల సమయంలో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
వెంటనే అప్రమత్తమైన అత్యవసర సిబ్బంది ఆమెకు ఘటనా స్థలంలో ప్రథమ చికిత్స అందించారు. తరువాత 119 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని సియోల్ రేస్ నిర్వాహక కమిటీ ధృవీకరించింది.
ఆమె మృతికి కారణమేంటి?
యూ జి-వోన్ మరణానికి కారణం ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. ఆమె ఎందుకు కుప్పకూలారు ? మరణానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి ? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, అవసరమైన చర్యలు తీసుకుంటామని రేస్ నిర్వాహకులు తెలిపారు. అలాగే ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
పరిశోధనతో పాటు పరుగులో
యూ జి-వోన్ కేవలం రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే కాదు.. దక్షిణ కొరియాలోని ప్రముఖ పరిశోధనా సంస్థ KAISTలో సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన పరిశోధనలు చేస్తున్న యువ పరిశోధకురాలు కూడా. ఒకవైపు ఉన్నత స్థాయి పరిశోధనలు చేస్తూనే, మరోవైపు పరుగుపందాల్లో పాల్గొనడం ద్వారా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చదువు, పరిశోధనలతో పాటు క్రీడలపైనా ఆమెకు ఎంతో ఆసక్తి ఉండేది. కానీ ఆమె అకాల మరణం పలువురిని కలచివేసింది.
సోషల్ మీడియాలో సంతాపం
యూ జి-వోన్ మరణవార్త తెలిసిన వెంటనే ఆమె సోషల్ మీడియాలో సంతాపాలు వెల్లువెత్తాయి. తోటి రన్నర్లు, ఇంజనీర్లు, క్రీడాభిమానులు ఆమెను గుర్తుచేసుకుంటూ నివాళులర్పిస్తున్నారు. క్రీడలపై మక్కువతో పాటు పరిశోధన రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువతిని కోల్పోవడం బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాఫ్ మారథాన్‌ను పూర్తి చేయడానికి కేవలం 500 మీటర్ల దూరంలో ఉండగా యూ జి-వోన్ కుప్పకూలి మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మరణానికి అసలు కారణం అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
South Korean running influencer Yoo Ji-won has died aged 25 after collapsing just 500 meters from the finish line of a half-marathon https://t.co/xi3XzvfU35
— Dexerto (@Dexerto) October 15, 2026


