దసరా నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని భక్తులు పెద్దఎత్తున దర్శించుకుంటున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన క్యూలైన్ల నిర్వహణ, భక్తుల భద్రత, మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు పంపిణీతోపాటు చిన్నారులకు పాలు అందిస్తున్నారు.
అన్నప్రసాద పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేపట్టడంతోపాటు ఆలయ పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. భక్తుల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు పోలీసు సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థల ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, క్యూలైన్లలో భక్తులు క్రమశిక్షణ పాటించేలా చర్యలు చేపడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా సంబంధిత సిబ్బంది అప్రమత్తంగా ఉంటున్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, పాలకమండలి ఛైర్మన్ బొర్రా గాంధీ, పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం.ధ్యానచంద్ర ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపడుతూ ఉత్సవాల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు


