
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అత్యంత సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. అయితే, ఇటీవల కాలంలో టీడీపీ ఇచ్చే కొన్ని ప్రతిపాదనలపై జనసేనాని పవన్ కళ్యాణ్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి. నిన్న అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత జరిగిన ఒక అంతర్గత పరిణామం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది.
కేబినెట్ భేటీ అధికారికంగా ముగిసిన అనంతరం, త్వరలో జరగబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై చంద్రబాబు నాయుడు జనసేనానితో చర్చించాలని భావించినట్లు సచివాలయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాల పంపకాలపై ఒక స్పష్టతకు వద్దామని బాబు ప్రతిపాదించగా.. పవన్ కళ్యాణ్ మాత్రం ఆ టాపిక్ను అప్పుడే తేల్చడానికి అంతగా సుముఖత చూపించలేదని టాక్. “ఆ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కదా, ముందు ప్రభుత్వ కార్యక్రమాలపై దృష్టి పెడదాం” అన్నట్లుగా పవన్ క్లుప్తంగా ముగించేశారని గాసిప్ రాయుళ్లు కోడై కూస్తున్నారు.
ఇటీవల కాలంలో విజయవాడ, గుంటూరు మేయర్ పీఠాల మార్పిడి వ్యవహారంలో టీడీపీ ఎంపీలు పెమ్మసాని, కేశినేని చిన్నిలు జనసేన ప్రతిపాదనకు అడ్డుచెప్పడం పవన్ కళ్యాణ్కు కాస్త అసంతృప్తి కలిగించి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో జనసేన క్యాడర్ బలంగా ఉన్న స్థానాల్లో కూడా టీడీపీ నేతలు పట్టుబడుతుండటంతో, పవన్ కాస్త వ్యూహాత్మక మౌనం వహిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే టీడీపీ నుంచి వస్తున్న కొన్ని ప్రతిపాదనలను ఆయన ఇప్పుడే ఓకే అనకుండా హోల్డ్లో పెడుతున్నట్లు సమాచారం.
సాధారణంగా చంద్రబాబు నాయుడు ఏ చిన్న రాజకీయ అవకాశాన్ని వదలకుండా ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అందులో భాగంగానే లోకల్ బాడీ ఎన్నికలను చకచకా ముగించాలని ఆయన భావిస్తున్నారు. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం తన పార్టీకి దక్కాల్సిన వాటాపై పూర్తి క్లారిటీ వచ్చే వరకు తొందరపడకూడదనే స్ట్రాటజీతో ఉన్నట్లు కనిపిస్తోంది. మరి కేబినెట్ వేదికగా వినిపిస్తున్న ఈ గాసిప్స్ కేవలం ఊహాగానాలేనా, లేక కూటమిలో సీట్ల సర్దుబాటు పంచాయితీ మరింత పెరగబోతోందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.
The post బాబు లోకల్ టాపిక్ ఎత్తితే.. పవన్ సైలెంట్ అయ్యారా..? appeared first on Telugu Rajyam.





