Shashi Tharoor : సీజేపీ ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు, భద్రతా సిబ్బంది దిగ్బంధనం చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. ఇదే సమయంలో సీజేపీ నేతలు సహా ప్రతిపక్ష నేతల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. లాయర్లను హౌజ్ అరెస్టు చేశారు. ఈ పరిణామాలపై కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత శశి థరూర్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఎన్నికల సంఘంపై విశ్వసనీయతను పెంచలేరు అంటూ వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో పరిస్థితి చూస్తుంటే.. ఇది ఎమర్జెన్సీ కాదని.. అప్రకటిత ఎమర్ జెన్ జీలా ఉందని వ్యాఖ్యానించారు. శనివారం శశిథరూర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. సీజేపీ ఆందోళన చేస్తుందనే ఉద్దేశంతో ఢిల్లీలో ప్రజలను ఇలా ఇబ్బందిపెట్టడం సరికాదని థరూర్ అన్నారు. ఢిల్లీలో భావ ప్రకటనా స్వేచ్ఛను పూర్తిగా తొలగించేశారని విమర్శించారు. ప్రతి 100 మీటర్లకు ఒక చెక్‌పాయింట్, తనిఖీలు, బారికేడ్ల ఏర్పాటు, 22,000 మంది భద్రతా సిబ్బంది మోహరింపు.. ఇవన్నీ ప్రజలు ఎన్నికల సంఘం సమగ్రతను శాంతియుతంగా ప్రశ్నించకుండా ఉండేందుకేనని మండిపడ్డారు.
ఢిల్లీ రావాల్సిన 250 వరకు రైళ్లు రద్దయ్యాయని, మెట్రో సేవలు ఆగిపోయాయని ప్రస్తావించారు. అదుపులోకి తీసుకున్న వారిని వెంటనే విడుదల చేయాలని శశి థరూర్ డిమాండ్ చేశారు. బారికేడ్లు పెట్టి ప్రజలను అడ్డుకున్నంత మాత్రాన.. ప్రజల్లో ఎన్నికల సంఘం కోల్పోయిన విశ్వసనీయతను తిరిగి తీసుకరాలేరని విమర్శించారు. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న చర్యలు అత్యంత సిగ్గుచేటు అని ఆయన అభిప్రాయపడ్డారు.






