
గన్నవరం నియోజకవర్గ రాజకీయం మళ్లీ పాత రోజులను గుర్తుకు తెస్తోంది. గత కొంతకాలంగా చట్టపరమైన ఇబ్బందులు, వరుస కేసుల వల్ల సైలెంట్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్.. ఇప్పుడు రూట్ మార్చారు. వరుస విచారణలు, ప్రత్యర్థుల విమర్శల దాడి జరుగుతున్నా.. వంశీ ఎక్కడా తగ్గడం లేదు సరే కదా, మరింత ధైర్యంగా గళం విప్పుతున్నారు. కేసుల భయాన్ని పక్కన పెట్టి, నియోజకవర్గంలోనూ పర్యటనలు చేస్తూ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.
నేరుగా సీఎంను టార్గెట్ చేసి విమర్శలు చేసారు వంశీ. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు వంశీలో ఈ మార్పు రావడం వెనుక ఒక స్పష్టమైన వ్యూహం ఉందనే చర్చ నడుస్తోంది. తనపై ఎన్ని కేసులు పెట్టినా చట్టపరంగా ఎదుర్కొనేందుకు ఆయన సిద్దంగా ఉన్నారని, కేసుల భయం పెద్దగా వంశీలో కనపడటం లేదని, పార్టీ అధిష్టానం నుంచి న్యాయపరమైన మద్దతు బలంగా అందుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వంశీ ఏమాత్రం డిఫెన్స్లోకి వెళ్లకుండా అంతే ఘాటుగా సమాధానాలు ఇస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు.
మరోవైపు గన్నవరం నియోజకవర్గ పరిధిలో వంశీ మళ్లీ క్షేత్రస్థాయిలో యాక్టివ్ కావడం స్థానిక టీడీపీ క్యాడర్ ను కలవరపెడుతోంది. ఎన్నికల ఓటమి తర్వాత క్యాడర్ చెల్లాచెదురవుతుందని భావించినప్పటికీ, వంశీ స్వయంగా రంగంలోకి దిగి స్థానిక కాంట్రాక్టుల వివాదాలు, లీగల్ నోటీసుల పర్వంలో తన అనుచరులకు అండగా నిలబడుతున్నారు. కేసులకు భయపడి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని వంశీ తన ప్రవర్తన ద్వారా స్పష్టం చేస్తుండటంతో.. గన్నవరంలో యార్లగడ్డ వర్సెస్ వంశీ పొలిటికల్ వార్ రాబోయే స్థానిక ఎన్నికల వేళ మరింత ముదిరేలా కనిపిస్తోంది.
The post వంశీకి ధైర్యం పెరిగిందా..? తగ్గేదే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే.. appeared first on Telugu Rajyam.





