Yoo Ji-won: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్ యూ జీ-వోన్ (Yoo Ji-won) హాఫ్ మారథాన్‌లో పాల్గొంటూ అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందింది. 25 ఏళ్ల జీ-వోన్ ఫినిషింగ్ లైన్‌కు కేవలం 500 మీటర్ల దూరంలో ఉండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కుప్పకూలిన వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆమె మరణానికి గల అధికారిక కారణం ఇంకా వెల్లడికాలేదు.
అక్టోబర్ 11న జరిగిన ‘సియోల్ రేస్’లో జీ-వోన్ 21.1 కిలోమీటర్ల హాఫ్ మారథాన్‌లో పాల్గొన్నారు. 20.6 కిలోమీటర్ల దూరం పూర్తి చేసిన తర్వాత ఆమె ఒక్కసారిగా కుప్పకూలారు. నిర్వాహకులు వెంటనే వైద్య సహాయం అందించి ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు నిర్వాహకులు తెలిపారు. సియోల్ రేస్ ఆర్గనైజింగ్ కమిటీ ఈ ఘటనపై ప్రకటన విడుదల చేసింది. రేసు చివరి దశలో ఒక పోటీదారు కుప్పకూలారని, వెంటనే వైద్య కేంద్రానికి తరలించగా ఆ తర్వాత మరణించినట్లు పేర్కొంది. మృతురాలి కుటుంబ సభ్యులు, సన్నిహితులకు సంతాపం తెలిపిన కమిటీ.. ఘటనపై సమగ్రంగా సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
జీ-వోన్ స్నేహితుడు, రన్నింగ్ కంటెంట్ క్రియేటర్ ‘బమ్మీ’ (Bummy) సోషల్ మీడియాలో ఆమెకు నివాళులర్పించడంతో మృతి చెందిన రన్నర్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఫినిషింగ్ లైన్ సమీపంలో జనాలు గుమిగూడటం తాను చూశానని, మొదట ఎవరికో గాయమై ఉంటుందని భావించినట్లు అతడు తెలిపాడు. రేసు పూర్తయిన తర్వాత అవార్డుల కార్యక్రమంలో జీ-వోన్ కోసం వెతికానని, ఆ తర్వాత విషయం తెలుసుకుని ఆసుపత్రికి వెళ్లినట్లు పేర్కొన్నాడు. చివరి క్షణాల్లో ఆమెతో ఉండలేకపోయానంటూ బమ్మీ ఆవేదన వ్యక్తం చేశాడు. రేసు పూర్తయిన తర్వాత జీ-వోన్‌తో కలిసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఎదురుచూసిన స్నేహితులకు ఆమె మరణం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
యూ జీ-వోన్ దక్షిణ కొరియాలో రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు పొందారు. తన ట్రైనింగ్ సెషన్లు, రన్నింగ్ రికార్డులు, వివిధ పోటీల్లో సాధించిన ఫలితాలను సోషల్ మీడియాలో పంచుకునేవారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 9 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అక్టోబర్ 4న చేసిన తన చివరి పోస్టులో ఇటీవల పూర్తి చేసిన 10 కిలోమీటర్ల రన్‌కు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. రన్నింగ్‌తో పాటు చదువు, పరిశోధన రంగంలోనూ జీ-వోన్ కొనసాగుతున్నారు. కొరియా అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (KAIST)లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సెమీకండక్టర్లపై గ్రాడ్యుయేట్ రీసెర్చర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. చిన్న వయసులోనే ఆమె ఆకస్మికంగా మృతి చెందడం స్నేహితులు, ఫాలోవర్లను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
View this post on Instagram






