Dhruv Rathee : వివాదాస్పద యూట్యూబర్ ధృవ్‌రాఠీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరియాణా, గుర్గావ్‌లోని, సెక్టార్ 56లో ఉన్న తన నివాసం నుంచి అతడిని ఢిల్లీ పోలీసులు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల బెంగళూరులో సీజేపీ చేపట్టిన నిరసనలో ధృవ్ రాఠీ పాల్గొన్నాడు. ఇప్పుడు, ఢిల్లీలో శనివారం జరగాల్సిన సీజేపీ ఆందోళనకు కూడా అతడు హాజరయ్యే అవకాశం ఉంది.
అందుకే, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 50 మంది పోలీసులు ఉదయం 7.48 గంటల సమయంలో ధృవ్ రాఠీ ఇంటికి వెళ్లారు. అప్పుడు వాళ్ల అమ్మ తలుపు తీయగా.. అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా విదేశాల్లో ఉంటున్న ధృవ్ రాఠీ.. సీజేపీ ఆందోళనల్లో పాల్గొనేందుకు ఇటీవల ఇండియా వచ్చాడు. అరెస్టుకు ముందు అతడు సీజేపీ ఆందోళనను ప్రభుత్వం అడ్డుకోవడంపై ఒక వీడియో రూపొందించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మరోవైపు ఢిల్లీలో సాగాల్సిన సీజేపీ ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఎక్కడికక్కడ సీజేపీ నేతల్ని, విద్యార్థులు, యువతను అడ్డుకుంటున్నారు. ఢిల్లీలో అత్యవసర పరిస్థితి ఉన్నట్లు కనిపిస్తోందని పలువురు నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పటికే సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కేను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 20,000 మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తు్న్నారు. అలాగే, ఢిల్లీ సహా అనేక ప్రాంతాల్లో 4,000 మందికిపైగా ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీక్షా స్థలి వద్దకు రాకుండా.. కొందరిని ఇంట్లోనే హౌజ్ అరెస్టు చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ఇక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. అలాగే, 50కిపైగా మెట్రో స్టేషన్లను మూసి ఉంచారు. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ముందు జాగ్రత్త చర్యగా ఢిల్లీలోని విద్యాసంస్థలు అన్నింటికీ శనివారం సెలవు ప్రకటించారు.






