Tushar Gandhi : జాతిపిత మహాత్మా గాంధీ (Mahathma Gandhi) మునిమనువడు తుషార్ గాంధీ (Tushar Gandhi) అరెస్టయ్యారు. ముంబై పోలీసులు (Mumbai Police) ఇవాళ ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద కాక్రోచ్ జన్‌తా పార్టీ (CJP) చేపట్టనున్న నిరసనకు మద్దతుగా ముంబైలోని ‘క్రాంతి మైదాన్ (Kranti Maidan)’ కు వెళ్తుండగా గాంధీని అరెస్ట్ చేశారు. ‘హమ్ భారత్ కే లోగ్’ అధ్యక్షుడిగా ఉన్న తుషార్ గాంధీ.. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు క్రాంతి మైదాన్‌లో నిరసన చేపట్టాలని శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా పిలుపునిచ్చారు.
అయితే ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి గామ్‌దేవి పోలీస్ స్టేషన్‌కు ఎలాంటి దరఖాస్తు అందలేదని, అనుమతి కూడా ఇవ్వలేదని జోనల్ డీసీపీ రాగసుధ తెలిపారు. నిరసనలకు క్రాంతి మైదాన్ అనువైన ప్రదేశం కాదని, అక్కడ ఆందోళనలు నిర్వహించకూడదంటూ హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని పోలీసు అధికారి స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలోనే తుషార్ గాంధీని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 2న ముంబైలోని శివాజీ పార్క్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలోనూ ఆయన వేదికపై కనిపించారు.
మరోవైపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ, ‘ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్’ చేపట్టనున్న నిరసన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఈ సంస్థలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. నిరసనల నేపథ్యంలో దేశ రాజధానిలో 20 వేల మందికి పైగా పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. శుక్రవారం రాత్రి నుంచి ఢిల్లీ మెట్రోలోని 45 స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను మూసివేశారు.






