దీపావళి పండుగ ముగిసే వరకు దేశంలో ఎలాంటి నిరసనలు చేపట్టవద్దని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అధికారికంగా వెల్లడించారు. తమ పార్టీకి మద్దతుగా నిలుస్తున్న యువత ఇళ్ల వద్దే ఉండాలని కోరారు. కుటుంబ సభ్యులతో కలిసి పండుగలను సంతోషంగా జరుపుకోవాలని ఆయన వారికి సూచించారు.
ముఖ్య ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తోంది. ఈ ఆందోళనల కారణంగా యువత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉద్యమకారుల భద్రతపై కుటుంబాలు కలత చెందుతున్నాయని దీప్కే పేర్కొన్నారు. తన కుటుంబంతో పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ కుటుంబాలు కూడా తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయని ఆయన వివరించారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే తాత్కాలికంగా ఆందోళనలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
మరోవైపు దేశ రాజధాని దిల్లీలోని ప్రసిద్ధ రామ్‌లీలా మైదానంలో దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు దిష్టిబొమ్మలతో పాటు ఈసారి వినూత్నంగా కాక్రోచ్ దిష్టిబొమ్మను కూడా దహనం చేయనున్నారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ దిల్లీ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. మురికికి, అపరిశుభ్రతకు చిహ్నంగా భావించే ఈ కీటకం 30 అడుగుల భారీ బొమ్మను తగులబెట్టనున్నట్లు రామ్‌లీలా కమిటీ స్పష్టం చేసింది.
ఈ పరిణామంపై అభిజీత్ దీప్కే వ్యంగ్యంగా స్పందించారు. తమ కాక్రోచ్ జనతా పార్టీకి ఉచితంగా ప్రచారం కల్పిస్తున్నందుకు రామ్‌లీలా కమిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతానికి నిరసనలకు విరామం ఇచ్చినప్పటికీ, పండుగల తర్వాత తమ కార్యాచరణను కొనసాగిస్తామని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు.
The post దీపావళి వరకు ఆందోళనలు వద్దు: అభిజీత్ దీప్కే appeared first on Adya News Telugu.






