Tuni Chairperson | పల్లకి మోసే కష్టం జనసైనికులది.. పల్లకి ఎక్కే అదృష్టం మాత్రం టీడీపీ నేతలది! కూటమి పొత్తులో భాగంగా కాకినాడ జిల్లా తుని మున్సిపల్ చైర్పర్సన్ స్థానం జనసేనకు దక్కగా.. ఆ పదవికి అభ్యర్థిగా మాత్రం టీడీపీ నుంచి వచ్చిన మళ్ల మీనాక్షి పేరు తెరపైకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో కూటమి రాజకీయాల్లో టీడీపీ నేతలకు ప్రాధాన్యం దక్కుతుందన్న చర్చ మొదలైంది. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న జనసైనికులకు ప్రాధాన్యం ఎక్కడన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
తుని మున్సిపాలిటీ చైర్పర్సన్ స్థానం ఇటీవల జనసేనకు కేటాయించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆశలు పెరిగాయి. తమలో ఎవరికి అవకాశం వస్తుందోనని స్థానిక నాయకులు ఎదురుచూస్తున్న తరుణంలో, టీడీపీ నుంచి వచ్చిన మళ్ల గణేష్ భార్య మీనాక్షి పేరు తెరపైకి రావడం రాజకీయ సమీకరణాలను ఆసక్తికరంగా మార్చింది. నిజానికి మాజీ కౌన్సిలర్ మళ్ల గణేష్ భార్య మీనాక్షికి టీడీపీ తరఫున అవకాశం కల్పించాలనే ఆలోచన ఉన్నట్లు తొలుత ప్రచారం జరిగింది. అయితే కూటమి సీట్ల సర్దుబాటులో తుని చైర్పర్సన్ స్థానం జనసేనకు కేటాయించడంతో పరిస్థితి మారింది. ఈ క్రమంలో మళ్ల గణేష్, మీనాక్షి దంపతులు రాత్రికి రాత్రే టీడీపీ నుంచి జనసేనలో చేరారు. అనంతరం మీనాక్షి పేరును జనసేన చైర్పర్సన్ అభ్యర్థిగా యనమల కృష్ణుడు ప్రకటించినట్లు స్థానిక రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ పరిణామం జనసేనలో కొత్త చర్చకు తెరలేపింది. జనసేనకు సీటు కేటాయించడంతో ఆ పార్టీకి చెందిన స్థానిక నాయకులు ఆశలు పెట్టుకున్నారు. కానీ అభ్యర్థిగా ఇటీవలే పార్టీలో చేరిన నేత కుటుంబానికి చెందిన వ్యక్తి పేరు వినిపించడంతో, పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వారి పరిస్థితి ఏమిటన్న చర్చ మొదలైంది. పార్టీ మారిన నేతలకు అవకాశాలు కల్పించడం ద్వారా రాజకీయ బలాన్ని పెంచుకోవాలని నాయకత్వం భావిస్తుండవచ్చు.. ఈ క్రమంలో పాత కార్యకర్తల ఆకాంక్షలు వెనుకబడితే, అది పార్టీ అంతర్గత సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.






